ఎల‌న్ మ‌స్క్‌, వివేక్ రామ‌స్వామిలకు కీల‌క బాధ్య‌త‌లు

ఎల‌న్ మ‌స్క్‌, వివేక్ రామ‌స్వామిలకు కీల‌క బాధ్య‌త‌లు
బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్‌, రిప‌బ్లిక‌న్ నేత వివేక్ రామ‌స్వామిలకు కీల‌క బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు డోనాల్డ్ ట్రంప్‌. దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైన త‌ర్వాత ఆయ‌న కొత్త‌గా ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గ‌వ‌ర్న‌మెంట్ ఎఫిషియ‌న్సీ(డీఏజీఈ)లో నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. ఎన్నికల సమయంలో తనకు మద్దతుగా నిలిచిన టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు సముచిత స్థానం కల్పిస్తున్నట్టు వెల్లడించారు.
ఎన్నికల ప్రచార సమయంలో దీనిపై ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ప్ర‌భుత్వ బ్యూరోక్ర‌సీని నియంత్రించ‌డం, వృద్ధా ఖ‌ర్చులు నివారించ‌డం, ఫెడ‌ర‌ల్ ఏజెన్సీల‌ను మార్చేందుకు మ‌స్క్, రామ‌స్వామిల‌ను నియ‌మించిన‌ట్లు ట్రంప్ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్ర‌భుత్వాన్ని స‌మ‌ర్థ‌వంతంగా న‌డ‌ప‌డ‌మే డీవోజీఈ ప్రాధాన కార్త‌వ్యం. క్రిప్టోక‌రెన్సీ డాగ్‌కాయిన్ త‌ర‌హాలో ఆ శాఖ‌కు డీవోజీఈ అని పేరు పెట్టారు. 
‘అద్బుతమైన ఈ ఇద్దరు అమెరికన్లు కలిసి ‘సేవ్ అమెరికా’ఉద్యమం అవసరానికి అనుగుణంగా ప్రభుత్వ బ్యూరోక్రసీ, అదనపు నిబంధనలు, వృధా ఖర్చులను తగ్గించడానికి, ఫెడరల్ ఏజెన్సీలను పునర్నిర్మించడానికి నా పరిపాలనకు మార్గం సుగమం చేస్తారు.. ఎలాన్, వివేక్ సమర్థతను దృష్టిలో ఉంచుకుని ఫెడరల్ బ్యూరోక్రసీలో మార్పులు చేస్తారని, అదే సమయంలో అమెరికన్ల జీవితాన్ని మెరుగుపరిచేందుకు నేను ఎదురు చూస్తున్నాను’అని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ట్రంప్ ప్రకారం.. ‘ప్రభుత్వంలోని భారీ వృధా, వ్యయాలు, మోసాలను వారు అరికడతారు’ అని అందులో తెలిపారు.

డాజ్‌కాయిన్‌ను ప్ర‌జ‌ల క్రిప్టో అని మ‌స్క్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల వేళ ట్రంప్‌కు సుమారు 200 మిలియ‌న్ల డాల‌ర్లు మ‌స్క్ విరాళం ఇచ్చారు. అధ్య‌క్ష రేసు స‌మ‌యంలో రిప‌బ్లిక‌న్ పార్టీ నామినేష‌న్ కోసం ట్రంప్‌తో రామ‌స్వామి పోటీప‌డ్డారు. కానీ ఆ త‌ర్వాత ట్రంప్‌కు ప్రియ‌మైన మ‌ద్ద‌తుదారుడిగా మారారు. అనేక మార్పులు చేప‌ట్టాల‌ని ఆయ‌న సూచించారు.

ఫాక్స్ న్యూస్ హోస్ట్‌, మాజీ ఆర్మీ సైనికుడు పీట్ హెగ్‌సెత్‌కు ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇక జాతీయ ఇంటెలిజెన్స్(సీఐఏ) డైరెక్ట‌ర్‌గా జాన్ రాట్‌క్లిఫ్‌ను నియ‌మించారు. పీట్ హెగ్‌సెత్‌.. గ‌తంలో మిలిట‌రీ మాజీ సైనికుల‌కు గ్రూప్‌కు అధినేత‌గా చేశారు. గ‌తంలో మిన్నెసొట నుంచి ఆయ‌న సేనేట్ సీటుకు ప్ర‌య‌త్నించారు. 

అమెరికా ఫ‌స్ట్ అన్న నినాదాన్ని పీట్ గ‌ట్టిగా న‌మ్ముతార‌ని ట్రంప్ పేర్కొన్నారు. ర‌క్ష‌ణ‌శాఖ మంత్రిగా పీట్ ఉన్నారంటే, మ‌ళ్లీ మన మిలిట‌రీ ఉన్న‌త స్థాయికి వెళ్తుంద‌న్నారు. హోంలాండ్ సెక్యూర్టీ శాఖ‌కు సౌత్ డ‌కోటా గ‌వ‌ర్న‌ర్ క్రిస్టీ నోయిమ్‌ను ట్రంప్ నియ‌మించారు. ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిగా గ‌తంలో ఈమె పేరు వినిపించింది. ట్రంప్ త‌ర‌పున నోయిమ్ తీవ్రంగా ప్ర‌చారం నిర్వ‌హించింది.