లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అరెస్ట్‌

లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అరెస్ట్‌
 
వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, రెవిన్యూ అధికారులపై జరిగిన దాడి వెనుక కుట్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరుడు సురేశ్‌ రాజ్‌ ఘటన జరిగిన సమయంలో ఆయనతో నిరంతరం సంప్రదించినట్టు పోలీసులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో కేబీఆర్‌ పార్క్ వద్ద మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి గ్రామస్తుల్ని రెచ్చగొట్టారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్‌ డేటా, సంభాషణలపై దర్యాప్తు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు సురేష్‌తో మాట్లాడినట్టు గుర్తించారు. కలెక్టర్‌పై దాడి యత్నం కేసులో భాగంగా అరెస్ట్ చేసి వికారాబాద్ తరలించారు.వికారాబాద్‌ జిల్లా దుద్యాల  మండలం లగచర్లలో సోమవారం కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ , ఇతర అధికారులపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

దాడి ఉదంతంపై సమగ్ర విచారణకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. లగచర్లకు చెందిన సురేశ్‌రాజ్‌ దాడికి కుట్రపన్నినట్టు పోలీసులు ప్రకటించారు. షెడ్యూల్‌లో లేని గ్రామానికి రావాలని అతనే తీసుకువెళ్లినట్టు వెల్లడించారు. సురేశ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని మంత్రికి వివరించారు. సురేశ్‌పై మూడు నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు ప్రధాన నిందితుడిగా చేర్చారు.

లగచర్ల గ్రామంలో సోమవారం అధికారులపై దాడి ఘటనపై ఆ అర్ధరాత్రి నుంచే  పోలీస్‌ యాక్షన్‌ షురూ అయింది. అర్ధరాత్రి వేళ కరెంట్‌ సరఫరా నిలిపేసి, ఇంటర్నెట్‌ సేవలు బంద్‌ చేసి, ఇండ్ల తలుపులు బద్దలు కొడుతూ ఇల్లిల్లూ సోదాలు చేసి, సుమారు 300 మంది పోలీసులు 55 మందిని పట్టుకొని బంధించారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

విచారణ అనంతరం 16 మంది రైతులకు కోర్టుకు రిమాండ్‌ చేశారు. వారికి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వగా, పరిగి సబ్‌ జై లుకు తరలించారు. సోమవారం అర్ధరాత్రి దాటాక లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. లగచర్లలో రైతుల నిరసన సమయంలో జరిగిన దాడి ఘటనపై పరిసర మండలాల్లో సైతం ఇంటర్‌నెట్‌ సేవలను బంద్‌ చేశారు. దుద్యాల, కొడంగల్‌, బొంరాస్‌పేట్‌ మండలాల్లో అధికారులు పూర్తిగా ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు.