ప్రజా వంచన ఉత్సవాలు చేసుకోండి

ప్రజా వంచన ఉత్సవాలు చేసుకోండి
 
ఏడాది పాలనలో ఏంసాధించారని కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బండి సంజయ్ ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు అమలు చేశారని విజయోత్సవాలు చేసుకుంటున్నారా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలనెలా రూ.2500 లు ఇచ్చారని విజయోత్సవాలు చేసుకుంటారా? 
 
వృద్దులకు రూ.4 వేల ఆసరా పెన్షన్ ఇచ్చారని చేసుకుంటారా? పేదలకు ఇండ్లు ఇచ్చారని చేసుకుంటారా? దేనికోసం విజయోత్సవాలు అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. అవన్నీ ఇచ్చాక ఉత్సవాలు చేసుకోవాలని హితవు పలికారు. ఇప్పుడు మీరు చేసుకోవాల్సింది విజయోత్సవాలు కాదు… నమ్మించి ప్రజలను మోసం చేసిందుకు ‘ప్రజా వంచన’ ఉత్సవాలు చేసుకోండని ధ్వజమెత్తారు.కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద బీజేపీ నాయకులతో కలిసి కొనుగోలు కేంద్రాలను బండి సంజయ్‌ సందర్శించారు. వడ్ల కొనుగోలులో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పైసలివ్వకుండా తప్పించుకోవడానికి వడ్ల కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తోందని మండిపడ్డారు.

 బ్రోకర్ల నుంచి కమీషన్లు దండుకునేందుకు రాష్ట్ర రైతుల ప్రయోజనాలను బలి పెడుతున్నారని ధ్వజమెత్తారు. వడ్ల పైసలన్నీ మిత్తీతో సహా కేంద్రమే చెల్లిస్తోందని, అయినప్పటికీ వడ్లు కొనివ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన నొప్పి ఏందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులకు కనీస మద్దతు ధర దక్కలేదని, బోనస్‌ రాలేదని ధ్వజమెత్తారు. 

పైగా తాలు, తరుగు, తేమ పేరుతో నష్టం జరిగిందన్నారు. ఇక మీరు రైతులను ఆదుకున్నదెక్కడ అని ప్రశ్నించారు. ఇదేనా రైతు ప్రభుత్వమంటే? ఇదేనా ఇందిరమ్మ పాలన? అని మండిపడ్డారు. రైతులను అరిగోసపెట్టి దోచుకోవడమేనా కాంగ్రెస్ పాలనంటే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ ఖరీఫ్ సీజన్‌లో 95 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తే… బహిరంగ మార్కెట్ అవసరాలకు 40 లక్షల వడ్లు పోతే, మిగిలిన 55 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలుకు సంబంధించి పైసలన్నీ చెల్లించేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. చివరకు వడ్ల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం బయట నుంచి అప్పు తీసుకుంటే… ఆ డబ్బులకు వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తోందని.. అయినా ఎందుకు సకాలంలో వడ్లు కొనకుండా రైతులను అరిగోస పెడుతోందని ప్రశ్నించారు.