వాతావరణ మార్పులపై వర్ధమాన దేశాలకు మరింత సాయం అందించాలి

వాతావరణ మార్పులపై వర్ధమాన దేశాలకు మరింత సాయం అందించాలి

* నేడే బాకులో సిఒపి-29 శిఖరాగ్ర సదస్సు ప్రారంభం

వాతావరణ మార్పుల కారణంగా ఎదురవుతున్న సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సంపన్న దేశాలు వర్ధమాన దేశాలకు మరింత ఆర్థిక సాయాన్ని అందించాల్సిన అవసరం ఉన్నదని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి (యూఎన్‌ఈపీ) సంబంధించిన నివేదిక సూచించింది. ఈ నివేదికను ఈ నెల 7వ తేదీన విడుదల చేశారు. 

ప్రస్తుతం వర్ధమాన దేశాలకు అందుతున్న సాయం, అందాల్సిన సాయం మధ్య ఏటా 187-359 బిలియన్‌ డాలర్ల వ్యత్యాసం ఉన్నదని ఆ నివేదిక ఎత్తిచూపింది. 2021లో వర్ధమాన దేశాలకు సంపన్న దేశాలు 22 బిలియన్‌ డాలర్లు అందించగా అది 2022 నాటికి 28 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. పారిస్‌ ఒప్పందం తర్వాత ప్రతి ఏటా ఈ సాయం పెరుగుతూనే ఉన్నప్పటికీ అది చాలదని నివేదిక అభిప్రాయపడింది.

2025 నాటికి సంపన్న దేశాల సాయం 38 బిలియన్‌ డాలర్లకు చేరాలని గ్లాస్గో వాతావరణ ఒప్పందం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే అప్పటికి వర్ధమాన దేశాలకు కనీసం 40 బిలియన్‌ డాలర్ల సాయం అయినా అందాలని, వ్యత్యాసాన్ని పూడ్చాలంటే ఇది అవసరమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ అంటోనియో గుటెర్రస్‌ తెలిపారు. 

కాగా వర్ధమాన దేశాలపై రుణ భారం పెరిగిపోతోందని యూఎన్‌ఈపీ నివేదిక తెలిపింది. వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో ప్రైవేటు పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, అయితే ప్రస్తుతం అవి ఆశించిన స్థాయిలో లేవని చెప్పింది. ఆర్థిక సాయాన్ని అందుకోవడంతో పాటు సామర్ధ్యాన్ని పెంచుకోవడం, సాంకేతిక బదిలీలను బలోపేతం చేసుకోవడంపై వర్ధమాన దేశాలు దృష్టి సారించాలని సూచించింది. 

ముఖ్యంగా ఏదో ఒక సాంకేతికతను అందిపుచ్చుకోవడం కంటే దేశ అవసరాలను గమనంలో ఉంచుకోవాలని కోరింది. వాతావరణ మార్పుల విషయంలో 87 శాతం దేశాలు ఒకే విధానాన్ని రూపొందించుకున్నాయి. కొన్ని దేశాలకు రెండు లేదా అంతకంటే ఎక్కువ విధానాలే ఉన్నాయి. వాతావరణ మార్పులు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక సమాజాలను ధ్వంసం చేస్తున్నాయి. 

ముఖ్యంగా పేద దేశాలు వాటిని తట్టుకోలేకపోతున్నాయి. తుపానుల కారణంగా నివాస గృహాలు నేలమట్టం కావడం, అడవులలో కార్చిచ్చులు, భూమి కోత, కరువు కాటకాలు వంటి పరిణామాలు వాతావరణ మార్పుల కారణంగానే సంభవిస్తున్నాయని యూఎన్‌ఈపీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఇంగర్‌ అండర్సన్‌ చెప్పారు.  వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతో ప్రజలు, వారి జీవనభృతి, వారు ఆధారపడే వనరులు..అన్నీ ధ్వంసం అవుతున్నాయని, దీనిపై ప్రపంచ నేతలు తక్షణమే చర్చించి చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు.

ఇలా ఉండగా, వాతావరణ మార్పులపై  అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో సిఓపి-29 శిఖరాగ్ర సదస్పు సోమవారం ప్రారంభం అవుతుంది. ప్రతి యేటా జరిగే ఈ దస్సుల్లో కర్బన ఉద్గారాల తగ్గింపు, ఫైనాన్స్‌ స్కీమ్స్‌, ఫండింగ్‌ గురించి వివిధ దేశాల అధినేతలు హామీలు కురిపిస్తారు. లక్ష్యాలను ప్రకటిస్తారు. అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. అడుగు మందుకు పడడం లేదు. 

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ మళ్లీ ఎన్నికయ్యాక వాతావరణ మార్పులపై పారిస్‌ ఒప్పందం నుంచి తాము వెనక్కి వచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సంకేతాలు ఇచ్చారు. దీంతో బాకు సదస్సులో ఎలాంటి పురోగతి ఉండే అవకాశం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. యుద్ధాలు, కర్బన ఉద్గారాల ద్వారా భూగోళం వేడెక్కడానికి కారణమవుతున్న సంపన్న దేశాలు, పరిహారం చెల్లింపు విషయానికొచ్చేసరికి వర్థమాన దేశాలపై భారాన్ని నెట్టేసే యత్నం చేస్తున్నారు. చర్చలు ప్రతిష్టంభనలో పడడానికి ఇదే ముఖ్య కారణం.