భారత్ సహా 14 దేశాల విదేశీ విద్యార్థులకు కెనడా షాకిచ్చింది. విద్యార్థులకు వేగంగా స్టడీ వీసా ఇచ్చేందుకు 2018లో ప్రారంభించిన స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(ఎస్‌డీఎస్) విధానాన్ని కెనడా ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో పాటు నైజీరియా విద్యార్థులకు వేగంగా వీసా కల్పించే నైజీరియా స్టూడెంట్ ఎక్స్‌ప్రెస్(ఎన్‌ఎస్‌ఈ) విధానాన్ని కూడా ఆపేసింది.
‘విద్యార్థులందరికీ దరఖాస్తు ప్రక్రియలో సమాన అవకాశాన్ని, పారదర్శక విధానాన్ని, సానుకూల విద్యా అనుభవాన్ని అందించేందుకు ఎస్‌డీఎస్, ఎన్‌ఎస్‌ఈ కార్యక్రమాలను తక్షణం నిలిపివేస్తున్నాం.’ అని కెనడా ప్రభుత్వం ప్రకటించింది. ఇక నుంచి విద్యార్థులంతా సాధారణ స్టడీ పర్మిట్ విధానం ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని, అంతర్జాతీయ విద్యార్థులను స్వాగతిస్తూనే ఉంటామని పేర్కొన్నది. ఎస్‌డీఎస్, ఎన్‌ఎస్‌ఈ కింద శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల లోగా దరఖాస్తు చేసుకున్న వారిని పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది.
ఆర్థికపరమైన సవాళ్లు, ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి, పెరుగుతున్న జీవనవ్యయం, ఇండ్ల లభ్యత తగ్గిపోవడం వంటి కారణాలతో దేశంలోకి వలసలను తగ్గించేందుకు కెనడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఎస్‌డీఎస్ విధానం రద్దు చేయడం కెనడాకు వెళ్లి చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఇంతకుముందు ఎస్‌డీఎస్ ద్వారా మన విద్యార్థులకు వేగంగా కెనడా స్టడీ వీసాలు దక్కేవి. ఇక నుంచి భారతీయ విద్యార్థులు సాధారణ విధానం ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో వీసా కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. కాగా, కెనడాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య దాదాపు 35 శాతం వరకు ఉంటుంది.
బయటి దేశాల విద్యార్థులకు నేరుగా వీసా మంజూరు చేసేందుకు ఉద్దేశించిన ఈ స్కీమును రద్దు చేయడంతో ఇక నుంచి కెనడా వెళ్లాలనుకునేవారికి వీసా దొరకడం దుర్లభమవుతుంది. భారత్‌తో సహా 13 దేశాల విద్యార్ధులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. భవిష్యత్‌లో దరఖాస్తు చేసుకోబోయే విద్యార్ధులు రెగ్యులర్ స్టడీ పర్మిట్ దరఖాస్తు ప్రక్రియను అనుసరించాల్సి వుంటుంది.
ఎస్‌డిఎస్‌ను 2018లో ప్రవేశపెట్టారు. భారత్, చైనా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇతర అర్హత గల దేశాలకు చెందిన విద్యార్ధులు కెనడాలో చదువుకోవడానికి ఎక్కువ ప్రయాసపడకుండా అవకాశాలను ఈ పథకం కల్పించేది ఏటా వేలాదిమంది విద్యార్ధులు ఈ పథకం వల్ల లబ్ధి పొందేవారు. ముఖ్యంగా భారత్ విద్యార్ధులకు బాగా ఉపకరించేది.
More Stories
మాస్కోలో సిరియా అధ్యక్షుడు అసద్‌కు రష్యా ఆశ్రయం
చిన్మయ్ కృష్ణదాస్‌పై బంగ్లాదేశ్‌లో మరో కేసు
దక్షిణ కొరియా రక్షణ శాఖ మాజీ చీఫ్ నిర్బంధం