రష్యాలో జననాల రేటు పెంచేందుకు శృంగార మంత్రిత్వ శాఖ

రష్యాలో జననాల రేటు పెంచేందుకు శృంగార మంత్రిత్వ శాఖ
 
చైనాతో పాటు పలు ఐరోపా దేశాలు ఇప్పుడు జననాల రేటు గణనీయంగా పడిపోతూ ఉండడంతో తీవ్రంగా కలత చెందుతున్నాయి. గత కొన్నేళ్లుగా రష్యాలో జనన మరణాల మధ్య భారీ తేడా కనిపిస్తోంది. ఇక గత రెండున్నర ఏళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాలో సైనికులు చనిపోతుండగా దేశంలో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఇక జననాల రేటు కూడా తగ్గిపోతుండటం రష్యాను తీవ్రంగా కంగారుపెడుతోంది. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రష్యాలో కొత్తగా మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ పేరిట మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రష్యాలో జననాల రేటును పెంచేందుకు ఈ కొత్త ఆలోచన చేశారు. 
 
కుటుంబ రక్షణకు సంబంధించిన పార్లమెంట్ కమిటీ ఈ మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ ఏర్పాటుకు సంబంధించి పరిశీలన చేస్తోందని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
రష్యాలో జనన మరణాల రేటులో ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు పుతిన్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఓ ఏజెన్సీ ఈ ప్రతిపాదన చేసింది. 
 
జననాల రేటును పెంచే కార్యక్రమాలన్ని ఈ మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ శాఖ పరిధిలో ఉంచాలంటూ సూచించింది. యువతీయువకుల మధ్య బంధాలను ప్రోత్సహించేందుకు వారి ఫస్ట్ డేట్‌కు 5000 రూబెల్స్‌ అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.4300 ఇవ్వాలని పేర్కొంది. అంతేకాకుండా ఇంటి పనులు, పిల్లలను చూసుకునేందుకు ఉద్యోగం మానేయాలనుకునే వారికి కొంత మొత్తం చెల్లించాలని వెల్లడించింది.
 
ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని ప్రతిపాదనలను కూడా పార్లమెంట్ కమిటీ చేసింది. రష్యాలో జననాల రేటును పెంచడం కోసం మహిళల వ్యక్తిగత వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచార సేకరణలో భాగంగా ప్రభుత్వ రంగానికి చెందిన మహిళా ఉద్యోగులకు కొన్ని ప్రశ్నలతో కూడిన ఫామ్స్‌ అందించినట్లు సమాచారం.

రష్యా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకార ఈ ఏడాదిలో జూన్‌ వరకు దాదాపు 6 లక్షల మంది పిల్లలు మాత్రమే పుట్టారు. ఇది గతేడాది జూన్‌తో పోలిస్తే దాదాపు 16 వేలు తక్కువ. అయితే రష్యాలో 1999 నుంచి జననాల రేటులో క్రమంగా తగ్గుదల కనిపిస్తోంది. మరోవైపు ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య 3.25 లక్షల మరణాలు నమోదు అయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే ఇవి 49 వేలు ఎక్కువ అని తెలిపింది.
 
రష్యాకు వచ్చిన వలసదారుల జనాభా 20.1 శాతం ఉండటంతో జనాభా తగ్గుదల కొంతవరకు తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే రష్యాలో జనాభాను పెంచేందుకు సోవియట్‌ కాలంలో అమల్లో ఉన్న ఓ పురస్కారాన్ని 2022లో పుతిన్‌ మళ్లీ తీసుకువచ్చారు. దీని ప్రకారం 10 మంది అంతకంటే ఎక్కువమంది పిల్లల్ని కనే మహిళలకు మిలియన్‌ రూబెల్స్‌ భారత కరెన్సీలో దాదాపు రూ.13 లక్షలకు పైన నజరానా ఇవ్వనున్నారు. 
 
దీంతోపాటు మదర్‌ హీరోయిన్‌ అనే అవార్డును కూడా ఇస్తామని పుతిన్‌ సర్కారు ప్రకటించింది. అయితే ఒక జంటకు 10వ బిడ్డ పుట్టినరోజు మొదటి రోజునే ఈ నగదు చెల్లిస్తామని తెలిపింది.  అప్పటికి మిగతా 9 మంది పిల్లలు జీవించి ఉండాలని షరతు పెట్టారు. ఈ ప్రకటన ఇచ్చిన తర్వాత కూడా రష్యాలో పెద్దగా మార్పు కనిపించడం లేదు.