అమెరికా తీర్పుతో భారత్ కు ఆనందం

అమెరికా తీర్పుతో భారత్ కు ఆనందం
అమెరికా ప్రజలు అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు పట్ల భారత్ సంతోషంగా ఉందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. భారత్, అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటున్నాయని చెప్పారు. భారత్- అమెరికాది బహుముఖమైన ప్రత్యేక భాగస్వామ్యని ఆయన పేర్కొన్నారు. 
 
అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మాట్లాడారని తెలిపారు. వివిధ రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా కలిపి పనిచేస్తామని ఇద్దరు నేతలు పునరుర్ఘాటించినట్లు చెప్పారు. అంతకుముందు మోదీ ఎక్స్ పోస్ట్లో ట్రంప్ చారిత్రక ఎన్నికల విజయానికి అభినందనలు తెలిపారని జైస్వాల్ గుర్తు చేశారు.
 
ఈ సందర్భంగా హెచ్1బీ వీసాల విషయంపై రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. “భారత్‌-అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలు చాలా విస్తృతమైనవి. 2023లో ఇరు దేశాల మధ్య దాదాపు 190 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. వస్తుసేవల్లో అమెరికా- భారత్కు రెండో అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది. ఇక హెచ్1బీ వీసాల విషయానికొస్తే- మొబిలిటీ, మైగ్రేషన్ పార్ట్నర్షిప్ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగం” అని స్పష్టం చేసారు. 
 
“చాలా వరకు భారతీయ నిపుణులు అమెరికాలో పనిచేస్తున్నారు. అనేక మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. డిఫెన్స్ టెక్నాలజీలో అమెరికా-భారత్ మధ్య పెద్ద పెట్టుబడి భాగస్వామ్యం ఉంది. ఈ అంశాలు అన్నింటిపై మేము వారితో మంచి చర్చలు జరపాలనుకుంటున్నాము.” అని జైస్వాల్ తెలిపారు.