ఎస్సీ వర్గీకరణపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో పాటు ఎమ్మార్పీఎస్ డిమాండ్ల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. దీనిపై కూటమి పార్టీలకు చెందిన దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఎస్సీ వర్గీకరణపై అనుసరించాల్సిన వ్యూహాన్ని చంద్రబాబు ఎమ్మెల్యేలకు వివరించారు.
వర్గీకరణ అమలు చేయడం ద్వారా దళిత ఉపకులాలందరికీ సమాన అవకాశాలు దక్కుతాయని, జానాభా దామాషా పద్దతిలో జిల్లా యూనిట్ గా వర్గీకరణ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు చంద్రబాబు వివరించారు. విద్యా, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ది, వ్యాపార అవకాశాలు కల్పించడం ద్వారా సమగ్ర అభివృద్ది సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పుతో పాటు ఎన్నికల హామీ కూడా ఉన్నందున కార్యాచరణపై ఎమ్మెల్యేలతో సిఎం చర్చించారు. సమైఖ్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు వర్గీకరణ అమలు చేశామని గుర్తు చేశారు. అయితే, తరువాత న్యాయ సమస్య కారణంగా ఆ కార్యక్రమం నిలిచిపోయిందని సిఎం చెప్పారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు వర్గీకరణను అమలు చేయడానికి సిద్ధమయ్యాయని, ఎవరికీ అన్యాయం జరగకుండా జిల్లా ఒక యూనిట్ గా వర్గీకరణ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సిఎం తెలిపారు.
తెలుగుదేశం దళితులకు మొదటి నుంచీ అండగా ఉందని చెబుతూ జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపామని సిఎం గుర్తు చేశారు. 2014 తరువాత జీవో నెంబర్ 25 ద్వారా దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు ఖర్చుపెట్టామని పేర్కొన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణపై స్పష్టత వచ్చింది కాబట్టి దీనికి అవసరమైన కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సిఎం తెలిపారు.
More Stories
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
ఏపీ నుండి బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య
చెన్నమనేని జర్మనీ పౌరుడే…తేల్చిచెప్పిన హైకోర్టు