అమరావతి పాత టెండర్లు రద్దు

అమరావతి పాత టెండర్లు రద్దు
 
అమరావతి పాత టెండర్లను రద్దు చేస్తూ సీఆర్డీఏ తీర్మానం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. దీంతో కొత్త టెండర్లు పిలవడానికి లైన్ క్లియర్ అయిందని చెప్పారు. 39వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణానికి పలు కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రాజధాని 217చ.కి.మీ పరిధిలో కెనాల్స్ తోపాటు క్యాపిటల్ సిటీకి బయట కూడా కొన్ని రిజర్వాయర్ల నిర్మాణానికి నెథర్లాండ్స్ ఇచ్చిన నివేదికను అథారిటీ ఆమోదించింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన   సీఆర్డీఏ 39వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్ హాజరై రాజధాని అమరావతికి సంబంధించిన పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. నెదర్లాండ్ సూచన మేరకు కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, తో పాటు పలు రిజర్వాయర్ల నిర్మాణానికి సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది.

ఈ సమావేశం అనంతరం మంత్రి నారాణయ మీడియాతో మాట్లాడారు. 2014-19 మధ్య అమరావతి రాజధాని ప్రాంతంలోని ఆరు లేన్ల రోడ్లు, అసెంబ్లీ, మంత్రులు, అధికారులు, న్యాయమూర్తుల భవనాలు, ఇతర పనులకు రూ.41 వేల కోట్ల అంచనాల వేశామని తెలిపారు. అప్పట్లో 38 వేల కోట్లకు టెండర్లు పిలిచామన్నారు. వీటిల్లో కొన్నింటికి అడ్వాన్ లు ఇచ్చామన్నారు. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం అమరావతి పనులు చేయకపోవడం వల్ల ఈ టెండర్ల గడువు ముగిసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడిందని ధ్వజమెత్తారు.

అమరావతి రాజధాని టెండర్ల ప్రక్రియపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చీఫ్ ఇంజినీర్లతో జులైన 24న సాంకేతిక కమిటీ వేశామన్నారు. ఈ కమిటీ అక్టోబర్ 29న నివేదిక ఇచ్చిందన్నారు. కొత్త టెండర్లు పిలవాలంటే ముందు గతంలో ఇచ్చిన టెండర్లను క్లోజ్ చేయాలని చీఫ్ ఇంజినీర్ల కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. 

ఈ నివేదికను ఇవాళ జరిగిన సీఆర్డీఏ సమావేశం చర్చించామని మంత్రి నారాయణ తెలిపారు. సాంకేతిక కమిటీ నివేదికలోని 23 అంశాలను పరిశీలించి పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను పిలవనున్నట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు.