బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన ట్రంప్‌

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన ట్రంప్‌

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్‌తో, ప్రధాని మోదీతో అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేస్తానని వెల్లడించారు. దీపావళి పండుగ నేపథ్యంలో సోషల్‌మీడియా వేదికగా పోస్టు చేసిన ఆయన హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ అమెరికాతోపాటు, ప్రపంచంలోని హిందువులను పట్టించుకోలేదని ట్రంప్ విమర్శించారు.  బంగ్లాలో హిందువులు, క్రైస్తవులతో పాటు ఇతర మైనారిటీలపై జరిగిన అనాగరిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాని చెప్పారు. అల్లరి మూకలు హిందువుల ఇండ్లు, దుకాణాలను దోపిడీ చేశారని తెలిపారు.

దీంతో ఆ దేశంలో తీవ్రమైన భయానక గందరగోళ పరిస్థితులు తలెత్తాయని పేర్కొంటూ తన పాలనా సమయంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ఆయన గుర్తు చేశారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కమలా, బైడెన్‌లు విస్మరించారని విమర్శించారు. ఇజ్రాయెల్‌ నుంచి మొదలుకొని, ఉక్రెయిన్‌, అమెరికా దక్షిణ సరిహద్దు వరకు విపత్తులు ఎన్నో ఉన్నాయని చెబుతూ తాము అధికారంలోకి వస్తే మళ్లీ అమెరికాను బలంగా తయారు చేసి శాంతిని నెలకొల్పుతామని ట్రంప్ స్పష్టం చేశారు.

రాడికల్‌ లెఫ్ట్‌ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తామని ట్రంప్‌ భరోసా ఇచ్చారు. హిందువుల స్వేచ్ఛ కోసం పోరాడతామని పిలుపిచ్చారు. తన పరిపాలనతో ఇండియాతోపాటు తన స్నేహితుడు, ప్రధాని మోదీతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటామని తెలిపారు. కమలా హారిస్‌ గెలిస్తే అధిక పన్నులు, కఠినమైన నిబంధనలతో చిన్న వ్యాపారాలను దెబ్బతీస్తుందన ఆయన హెచ్చరించారు.

తాను విజయం సాధించినట్లయితే పన్నులు, నిబంధనల్లో కొత విధిస్తానని వెల్లడించారు. అమెరికాను అత్యంత శక్తిమంతగా, ఉత్తమంగా తీర్చిదిద్దుతానని, మరోసారి ఉన్నతస్థాయిలో నిలబెడతానని వెల్లడించారు. దీపావళి పండుగ చెడుపై విజయం సాధించేలా చేస్తుందని నమ్ముతున్నానని ట్రంప్‌ చెప్పారు.