డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌వైపే భారతీయ అమెరికన్లు మొగ్గు చూపుతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. 61 శాతం మంది హారిస్‌కే ఓటు వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 31 శాతం మంది ట్రంప్‌కు మద్దతిస్తున్నారు. యుగవ్‌తో కలిసి కార్నేజ్ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ నిర్వహించిన ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే (ఐఎఎఎస్) 2024లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే డెమోక్రాట్లకు ఆందోళన కలిగించే అంశాలు కూడా కొన్ని వున్నాయి.
2020తో పోలిస్తే డెమోక్రటిక్ అభ్యర్ధికి భారతీయ అమెరికన్ల మద్దతు కొంచెం తగ్గిందనే చెప్సాల్సి వస్తుందని సర్వే పేర్కొంటుంది. ఆనాడు 68శాతం మంది జో బైడెన్‌కు మద్దతిచ్చారు. ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీకి మద్దతు 61 శాతానికి పడిపోయింది. అలాగే నాలుగేళ్ళ నాడు ట్రంప్‌కు 22 శాతమే మద్దతు రాగా, ఇప్పుడు అది 31 శాతానికి పెరిగింది. తాము డెమోక్రాట్లమని చెప్పుకునే ఇండియన్ అమెరికన్స్ సంఖ్య కూడా 56 శాతం నండి 47 శాతానికి క్షీణించింది.
అలాగే డెమోక్రాట్లవైపు మొగ్గుచూపే వారి సంఖ్య కూడా 66 శాతం నుండి 57 శాతానికి పడిపోయింది. 40 ఏళ్లలోపు వయస్సు వున్న ఇండియన్ అమెరికన్ పురుషుల్లో 48 శాతం మంది ట్రంప్‌తో వున్నారు. హారిస్ వైపు 44 శాతం మందే వున్నారు. అమెరికా ఎన్నికల చరిత్రలో రిపబ్లికన్ అభ్యర్ధికి యువ భారతీయ పురుషులు మద్దతు పెరగడం ఇదే మొట్టమొదటిసారి.
భారత్‌లో జన్మించి, అమెరికాలో స్థిరపడిన వారితో పోల్చుకుంటే అమెరికాలో జన్మించిన భారతీయ సంతతి వర్గాల్లో కూడా ట్రంప్‌కే మద్దతు ఎక్కువగా వుంది.
ఇండియన్ అమెరికన్ ఓటర్లలో దేశ ఆర్థిక పరిస్థితుల పట్ల ఆందోళనల తర్వాత రెండో ప్రధానమైన అంశంగా అబార్షన్ హక్కులు వుంది. డెమోక్రటిక్ పార్టీ కీలక ప్రచారంశం కూడా ఇదే. ట్రంప్‌కు వున్న మద్దతుతో పోల్చుకుంటే అన్ని వయస్సుల మహిళా ఓటర్లు కూడా హారిస్ వైపే మొగ్గు చూపుతున్నారని సర్వే వెల్లడిస్తోంది.
అలాగే పురుషుల్లో కూడా ఈ చీలిక కనిపిస్తోంది. వృద్ధులైన ఓటర్లు హారిస్‌కే మద్దతిస్తున్నారు. నాలుగేళ్ళనాటితో పోల్చుకుంటే దేశీ ఓటర్లు కూడా ఎక్కువమంది వామపక్షం వైపు మొగ్గు చూపుతున్నారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీకి చెందిన దేవేష్ కపూర్, కార్నేజ్ ఎండోమెంట్‌కి చెందిన మిలాన్ వైష్ణవ్, అమెరికన్ యూనివర్శిటీకి చెందిన సుమిత్రా బదరినాథన్‌లు ఈ సర్వే నిర్వహించారు.
సెప్టెంబరు రెండో వారం నుండి అక్టోబరు రెండో వారం వరకు 714 మంది ఇండియన్ అమెరికన్‌లను వీరు సర్వే చేశారు. 2020లో కూడా ఇదే రీతిలో సర్వే జరిగింది. ఇండియన్ అమెరికన్స్‌లో రాజకీయ, సామాజిక వైఖరులను పరిశీలించే రీతిలో జరిగిన మొట్టమొదటి సర్వే అది. దేశవ్యాప్తంగా 52లక్షల మంది భారతీయ మూలాలు కలిగిన వారు అమెరికాలో వున్నారు. వారిలో 26లక్షల మంది అమెరికన్ పౌరులు గానే సర్వే అంచనా వేసింది.
అమెరికాలో రెండో అతిపెద్ద వలస సమూహంగా ఇండియన్ అమెరికన్స్ వున్నారు. మొదటి స్థానం మెక్సికన్ అమెరికన్స్. ఈ నేపథ్యంలో ఇండియన్ అమెరికన్స్ కీలకమైన ఓటింగ్ సమూహంగా మారారు. వీరిలో 96శాతంమంది ఓటర్లే. వారి ప్రధాన ఆదాయం వార్షికంగా 1,53,000 డాలర్లుగా వుంది. అంటే జాతీయ సగటుకన్నా రెట్టింపు అని సర్వే పేర్కొంది. వారి రాజకీయ ప్రభావం కూడా పరిగణనలోకి తీసకునే రీతిలోనే వుంది.
హారిస్ నామినేషన్ సమయంలో ఆ అంశం బాగా కనిపించింది. ఆర్థిక, వ్యాపార, విద్యా, వైద్య రంగాల్లో కూడా వీరు వుండడంతో ప్రజా జీవనంలో వారి ప్రాబల్యం ఎక్కువగానే వుంది. పైగా డోలాయమానం అధికంగా వుండే రాష్ట్రాల్లో వీరు ప్రధానంగా వుండడం మరో కీలకాంశం. హారిస్‌కు మద్దతిస్తున్న వారిలో మొదటి స్థానంలో ఆఫ్రికన్ అమెరికన్స్ వున్నారు. వీరు 77 శాతంగా వున్నారు.
ఆ తర్వాత ఇండియన్ అమెరికన్స్ 61 శాతంగా వున్నారు. 58 శాతం మంది హిస్సానిక్స్, 41 శాతంమంది శ్వేత జాతీయల మద్దతు హారిస్‌కు వుంది. అలాగే వామపక్ష భావజాలం వైపు మొగ్గు చూపుతున్న వారిలో హారిస్‌కు మద్దతిచ్చే వారి సంఖ్య 47 నుండి 55 శాతానికి పెరిగింది.
More Stories
ప్రధని మోదీకి డొమినికా దేశపు అత్యున్నత పురస్కారం
హైడ్రామా మధ్య అధికారిని కొట్టిన స్వతంత్ర అభ్యర్థి అరెస్ట్
అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా తులసీ గబ్బార్డ్