శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలనేది తన ఆలోచన అని టీటీడీ ఛైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడు వెల్లడించారు. ఒక పెద్ద ట్రస్టు ఉన్నప్పుడు మరో ట్రస్టు ఎందుకని ఆయన ప్రశ్నించారు. తిరుమల పవిత్రతను కాపాడాలని ప్రతిఒక్కరిని కోరుతున్నానని చెబుతూ తిరుమలలో పనిచేసేవాళ్లు ప్రతిఒక్కరూ హిందువై ఉండాలనేదే తన ప్రయత్నమని ఆయన స్పష్టం చేశారు.
తిరుమలలో ఎక్కడా దుర్గంధం లేకుండా చర్యలు తీసుకుంటామని, ప్రతి విషయాన్ని బోర్డు మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. భక్తులను ఎక్కువసేపు కంపార్టుమెంట్లలో ఉంచడం మంచిదికాదన్న ఆయన, చిన్నపిల్లలను కంపార్టుమెంట్లలో ఎక్కువసేపు ఉంచితే చాలా బాధపడతారని చెప్పారు. గత ఐదేళ్లు కంపార్టుమెంట్లలో పిల్లలకు పాలు కూడా ఇచ్చింది లేదని మండిపడుతూ కొత్త ప్రభుత్వం వచ్చాక పిల్లలకు పాలు, అల్పాహారం పెడుతున్నారని నాయుడు గుర్తు చేశారు.
టికెట్ల విషయంలో ఆలోచన చేస్తామని, గతంలో ఉన్న పద్ధతిని మళ్లీ తీసుకొస్తామని తెలిపారు. మెటీరియల్ సప్లయ్, ఆలయ భూములపై ప్రత్యేక కమిటీలు వేస్తామని, తిరుమలలోని యూనివర్సిటీ, ఆస్పత్రులపై దృష్టిసారిస్తామని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. కొండపై గాజు సీసాల్లో నీళ్లు భక్తులకు భారంగా మారాయన్న ఆయన, వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పేపర్ గ్లాసులు ఉచితంగా ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల పవిత్రత లేకపోయేసరికి చాలా బాధపడ్డానని చెప్పారు. గతంలో ఏడాదికి ఐదారుసార్లు తిరుమల వెళ్లేవాడినని, గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా వెళ్లలేదంటే తన బాధ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అన్ని విషయాలు మాట్లాడానని, బాధ్యతలు తీసుకున్న తర్వాత వస్తే మాట్లాడదామని ఆయన చెప్పారని ఆయన తెలిపారు.
తాను 1982 నుంచి టీడీపీలో పనిచేస్తున్నానని, పార్టీలో కూడా తనకు చాలా అనుభవం ఉందని చెప్పుకొచ్చారు. ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటానని, స్వామీజీలతో కూడా పరిచయాలు ఉన్నాయని తెలిపారు. హిందూధర్మం ఛానల్ కూడా ఏర్పాటు చేశానని ఆయన గుర్తు చేసారు.
More Stories
ఏపీలో రెండు జాతీయ రహదారుల విస్తరణ
వైసిపి ఎమేల్యేలకన్నా ఎక్కువ మంది ప్రభుత్వ విప్ లు
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్