ఏపీకి 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మాణానికి నిధులు

ఏపీకి 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మాణానికి నిధులు
ఏపీలో రహదారుల అభివృద్ధికి రూ.252.42 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకమైన రహదారుల అభివృద్ధికి కేంద్రం రూ. 400 కోట్లు మంజూరు చేసింది. ఏపీలో 200.06 కిలో మీటర్ల పొడవైన 13 రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి  నుంచి రూ. 400 కోట్లను మంజూరు చేసినట్లు నితిన్‌గడ్కరీ కొద్ది రోజుల క్రితం వెల్లడించారు. 

గుంటూరు- నల్లపాడు రైల్వే మార్గంలో రూ. 98 కోట్లతో 4 వరుసలతో ఆర్వోబీని నిర్మించేందుకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ వెళ్లి పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అవసరాల గురించి చర్చించారు. దీంతో వరుసగా ఏపీకి నిధులు విడుదల అవుతున్నాయి. కేటాయించిన నిధులు రాష్ట్ర అభివృద్ధి, పురోగతికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

ఇలా ఉండగా, రాష్ట్ర రహదారులను పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో అభివృద్ధి చేయడానికి కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టెండర్ల ద్వారా అర్హత కలిగిన కన్సల్టెన్సీలను ఎంపిక చేయాలని ఏపీఆర్‌డీసీ చీఫ్‌ ఇంజనీర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు (జీవో 318) జారీ చేసింది. 

ఈ అధ్యయనానికి అయ్యే ఖర్చు రూ.32.69 కోట్లుగా ఖరారు చేశారు. రాష్ట్రంలో ప్రధాన రహదారులను పీపీపీ విధానంలో విస్తరించి, అభివృద్ధి చేయాలని ఆర్‌అండ్‌బీని సీఎం చంద్రబాబు రెండు నెలల క్రితం ఆదేశించారు. దీనిలో భాగంగా ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం గుజరాత్‌, అసోం సహా పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి పీపీపీ రహదారులపై అధ్యయనం చేసి వచ్చింది.