* ముంబై ఎయిర్‌పోర్టులో రూ. 7.6 కోట్ల బంగారం స్వాధీనం
బంగారు వర్తకానికి ప్రసిద్ధి చెందిన త్రిసూర్‌లో బంగారు నగల తయారీ యూనిట్లపై కేరల గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జిఎస్‌టి) భారీ స్థాయిలో దాడులు జరిపి లెక్కల్లో చూపని 104 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 75 కోట్లు ఉంటుంది. టోరే డెల్ ఓరో పేరిట(ఫ్రెంచ్‌లో బంగారు స్తంభం) నిర్వహించిన ఈ ఆపరేషన్ బుధవారం సాయంత్రం ప్రారంభమై గురువారం కూడా కొనసాగింది.
700 మందికిపైగా అధికారులు జిల్లావ్యాపగా 78 ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించారు. బంగారు నగల తయారీ యూనిట్లతోపాటు నగల వ్యాపారుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. గత ఆరు నెలలుగా నగల తయారీదారులు జిఎస్‌టి మోసానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై రాష్ట్ర జిఎస్‌టి శాఖకు చెందిన నిఘా విభాగం దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
104 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసకున్న అధికారులకు బిల్లింగ్, ట్యాక్సేషన్ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారని వారు చెప్పారు. కాగా..దాడులలో లెక్కల్లో చూపని 120 కిలోల బంగారాన్ని జిఎస్‌టి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు ఇంతకుముందు వెల్లడించారు.
కాగా, విదేశాల నుంచి అక్రమంగా తరలించిన రూ. 7.60 కోట్లు విలువచేసే 9.4 కిలోల బంగారాన్ని ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. బంగారం అక్రమ తరలింపుపై సమాచారం అందుకున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డిఆర్‌ఐ) అధికారులు బుధవారం జైపూర్ నుంచి ముంబైకి వచ్చిన విమానంలో మారు పేర్లతో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులను అడ్డుకున్నారు.
వారి బ్యాగేజీని తనిఖీ చేయగా 9.487 కిలోల బరువున్న విదేశీ బంగారం బిస్కెట్లుగల మూడు ప్యాకెట్లు లభించాయి. వారిని ప్రశ్నించగా కువైట్ నుంచి బంగారం స్మగ్లింగ్ జరిగిందని, ఒక అంతర్జాతీయ విమానం నుంచి తమకు ఈ బంగారం అందిందని వారు చెప్పినట్లు ఒక అధికారి తెలిపారు. డొమెస్టిక్ రూట్‌లో ఈ బంగారాన్ని తరలిస్తున్నారని ఆయన చెప్పారు. నకిలీ పేర్లతో ప్రయాణిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆ అధికారి తెలిపారు.
More Stories
త్వరలోనే నీటితో నడిచే హైడ్రోజన్ రైలు
హైదరాబాద్ లోనూ అమెరికా అధ్యక్షుడి స్కై స్క్రేపర్స్!
ఎయిర్ ఇండియా- విస్తారా విలీనం పూర్తి