పారిశ్రామిక మద్యానికి సంబంధించి 34 ఏళ్ల నాటి తీర్పును కొట్టివేస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిస్టియల్ ఆల్కహాల్ తయారీని నియంత్రించే చట్టాలను చేసే అధికారం రాష్ట్రాలకు కూడా ఉందని బుధవారం స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వాలకు ఉన్న అధికారాన్ని తొలగించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
8:1 మెజార్టీతో సుప్రీం ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. సింథటిక్స్, కెమికల్స్ కేసులో 1990లో ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తాజాగా కొట్టివేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై.చంద్రచూడ్, మెజారిటీ అభిప్రాయాన్ని అందజేస్తూ, పారిశ్రామిక మద్యంపై చట్టం చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని, ఈ అధికారాలను రాష్ట్రాల నుండి తొలగించబోమని ఉద్ఘాటించారు.
వారి అధికార పరిధిలో పారిశ్రామిక మద్యం ఉత్పత్తి, సరఫరాను నియంత్రించడానికి వీలుందని ఆయన పేర్కొన్నారు. సింథటిక్స్ కెమికల్స్ కేసు కింద పారిశ్రామిక మద్యపానాన్ని నియంత్రించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి మంజూరు చేసిన ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ 1990లో ఇచ్చిన తీర్పును ఈ నిర్ణయం తోసిపుచ్చింది.
మెజారిటీ తీర్పును న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎ.ఎస్.ఓకా, జెబి.పర్దివాలా, ఉజ్జల్ భుయాన్, మనోజ్ మిశ్రా, ఎస్‌సి.శర్మ ఎజి.మసీహ్ లు రాష్ట్రాల హక్కులకు అనుకూలంగా బలమైన ఏకాభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయితే, ఈ తీర్పు ఏకగ్రీవంగా రాలేదు. జస్టిస్ బివి.నాగరత్న దీనితో విభేదించారు. పారిశ్రామిక మద్యంపై శాసనాధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండాలని ఆమె వాదించారు. ముఖ్యంగా వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) అమలు తర్వాత ఈ కీలక రంగాన్ని నియంత్రించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండాలని జస్టిస్ నాగరత్న తెలిపారు.
జిఎస్‌టి వచ్చిన తర్వాత పారిశ్రామిక ఆల్కహాల్ పై రాష్ట్ర ఆదాయాలు, పన్నుల అధికారంపై గణనీయమైన ప్రభావాలను చూపింది. సుప్రీంకోర్టు తీర్పు పారిశ్రామిక మద్యపాన నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార సమతుల్యత, రాష్ట్ర స్వయంప్రతిపత్తి, ఆదాయ ఉత్పత్తిపై దాని విస్తృత ప్రభావం వంటి చర్చలకు తెరలేపింది.
More Stories
ఆర్బిఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా
కొత్తగా వంద ఎయిర్బస్ విమానాలకు ఆర్డర్
నోయిడా విమానాశ్రయం రన్వేపై తొలి విమానం