వాయనాడ్ ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీ నామినేషన్

వాయనాడ్ ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీ నామినేషన్

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. వాయనాడ్‌ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్‌ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌, తల్లి సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సోదరుడు రాహుల్‌గాంధీ  కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే , పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సమక్షంలో ప్రియాంకాగాంధీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.

అంతకుముందు ప్రియాంకాగాంధీ తన సోదరుడు రాహుల్‌గాంధీ, పలువురు ఇతర కాంగ్రెస్‌ నేతలతో కలిసి వాయనాడ్‌ నియోజకవర్గంలోని కల్పెట్ట పట్టణంలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ రోడ్‌ షోలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, చత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ తదితరులు పాల్గొన్నారు. రోడ్‌ షో అనంతరం కల్పెట్టలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రియాంకాగాంధీ, రాహు‌ల్‌గాంధీ ప్రసంగించారు.

వాయనాడ్‌ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ప్రపంచం అంతా తన సోదరుడికి వ్యతిరేకంగా ఉన్ననాడు వాయనాడ్‌ ప్రజలు అండగా నిలిచారని ఆమె కుతజ్ఞతలు తెలిపారు. మీరు ఇచ్చిన మద్దతుతోనే ఆయన దేశంలో 8 వేల కిలోమీటర్ల యాత్ర చేయగలిగారని ఆమె కొనియాడారు. టీజమా సోదరుడికి మద్దతుగా నిలిచిన మీ అందరికీ తమ కుటుంబం రుణపడి ఉంటుందని చెప్పారు. ఆయన ఇప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్లాల్సి వచ్చిందని, కానీ తాను ఆయనకు, మీకు మధ్య బంధాన్ని బలోపేతం చేస్తానని ప్రియాంక  హామీ ఇస్తున్నానని తెలిపారు.

‘తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీ, పార్టీ నేతల కోసం నేను 35 ఏళ్లుగా ఎన్నికల ప్రచారాలు చేశా. మీ అందరి మద్దతుతో నా కోసం నేను ప్రచారం చేయడం ఇదే మొదటిసారి. నాకు అవకాశం ఇస్తే వయనాడ్​ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నా. కొండచరియలు విరిగిపడినప్పుడు అందరూ ఒకరినొకరు సాయం చేసుకోవడం నేను చూశాను. మీ ధైర్యమే నాకు స్ఫూర్తిని ఇచ్చింది. మీ కుటుంబంలో భాగం కావడం నాకు గౌరవం’ అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.

దేశంలో ఏ లోక్‌సభ స్థానానికైనా ఒకరే ఎంపీ ఉంటారని, కానీ వాయనాడ్‌కు మాత్రం ఇద్దరు ఎంపీలు ఉంటారని రాహుల్‌గాంధీ చెప్పారు. ప్రియాంకాగాంధీ అధికారిక ఎంపీగా ఉంటే, తాను అనధికారిక ఎంపీగా కొనసాగుతానని హామీ ఇచ్చారు. ఇద్దరం కలిసి వాయనాడ్‌ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు

కాగా ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగారు. ఆమె ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో కూడా ప్రత్యక్షంగా పోటీపడలేదు. ఆమె ఎన్నికయితే ఆమె కుటుంభం నుండి పార్లమెంట్ లో మూడవ వ్యక్తి అవుతారు. ఇప్పటికే ఆమె తల్లి సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు కాగా, సోదరుడు రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యుడు. కాగా వాయనాడ్‌ లోక్‌సభ స్థానానికి నవంబర్ 20న పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.