ఎల్‌ఏసీపై ప్రతిష్ఠంభన ముగిసిందని చైనా ప్రకటన

ఎల్‌ఏసీపై ప్రతిష్ఠంభన ముగిసిందని చైనా ప్రకటన

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట పెట్రోలింగ్‌, సైనిక ఉద్రిక్తలను తగ్గించడంపై చైనా, భారత్‌ మధ్య ఏకాభిప్రాయం కురింది. సైనిక, దౌత్య స్థాయిలో ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలో చైనా ఎల్‌ఏసీ వెంట ప్రతిష్ఠంభన ముగింపునకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది. తూర్పు లద్దాఖ్‌లోని ఎల్‌ఏసీపై ఒప్పందం కుదిరిందని పేర్కొంది. 

ఈ విషయంపై నిన్న భారత విదేశాంగ కార్యదర్శి ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. సరిహద్దుకు సంబంధించిన సమస్యలపై దౌత్య, సైనిక మార్గాల ద్వారా భారత్, చైనాల మధ్య చర్చలు జరిగాయని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి లిన్‌ జియాన్‌ పేర్కొన్నారు. ఇరుపక్షాలు సంబంధిత విషయాలపై ఓ పరిష్కారాన్ని కనుగొన్నాయన్నారు. ఈ ప్రతిపాదనల అమలుకు భారత్‌తో కలిసి చైనా పని చేస్తుందని జియాన్‌ పేర్కొన్నారు.

అయితే, బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడి మధ్య జరిగిన భేటీపై ప్రశ్నించగా.. స్పందించలేదు. సమావేశంపై ఏదైనా వివరాలు తెలిస్తే తెలియజేస్తానన్నారు. సోమవారం విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మాట్లాడుతూ వాస్తవాధీన రేఖ వెంబడి పెట్రోలింగ్‌పై భారత్, చైనాల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. 

2020లో ఈ ప్రాంతాల్లో తలెత్తిన సమస్యలకు పరిష్కారం లభించిందని.. సైనిక, దౌత్యపరంగా చైనాతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ప్రత్యేకంగా దేప్సాంగ్‌, డెమ్‌చోక్‌ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌కు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఎల్‌ఏసీపై సరిహద్దు పెట్రోలింగ్‌పై భారత్, చైనాల మధ్య కుదిరిన ఒప్పందంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా స్పందించారు.

 చైనాతో బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిందని చెప్పగలమని పేర్కొన్నారు. 2020కి ముందు మనం చేస్తున్న ప్రదేశాల్లో గస్తీ నిర్వహించగలుగుతామని చెబుతూ ఇది మంచి పరిణామంగా భావిస్తున్నామని చెప్పారు. వాస్తవానికి గాల్వాన్‌ లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 

ఆ తర్వాత ఇరుదేశాల 50-60వేల మంది సైనికులను ఎల్‌ఏసీలో మోహరించాయి. చైనాను ఎదుర్కొనేందుకు డోక్లామ్‌ తరహాలో భారత్‌ వ్యూహాలను సిద్ధం చేసింది. చైనా సైన్యాన్ని ఉపసంహరించుకోవాల్సిందేనని భారత్‌ స్పష్టం చేసింది. 2020 నాటి పరిస్థితిని పునరుద్ధరించాల్సిందేనని చెప్పింది. దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత చైనా మెట్టుదిగి వచ్చింది.

 జూన్ 15, 2020న గాల్వాన్ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య ఘర్షణలో కల్నల్‌తో సహా 20 మంది సైనికులు అమరులయ్యారు. చైనాకు చెందిన 40 మంది సైతం ప్రాణాలు కోల్పోయారు. అయితే, సైనికుల మరణాలను చైనా ధ్రువీకరించలేదు. 1962 యుద్ధం తర్వాత ఇరుదేశాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది.