ట్రిలియన్ ఆర్ధిక వ్యవస్థగా ఉత్తర ప్రదేశ్

ట్రిలియన్ ఆర్ధిక వ్యవస్థగా ఉత్తర ప్రదేశ్
2021-22లో జీఎస్‌డీపీ రూ. 16.45 లక్షల కోట్ల నుంచి 2023-24 నాటికి రూ. 25.48 లక్షల కోట్లకు చేరుకోవడంతో ఉత్తరప్రదేశ్ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే మార్గంలో ఉందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భరోసా వ్యక్తం చేశారు. ఇది ఈ ఏడాది రూ.32 లక్షల కోట్లకు పెరగనుందని చెప్పారు.
 
రాష్ట్ర ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, గత ఏడేళ్లలో రాష్ట్ర వృద్ధి, తలసరి ఆదాయం రెండింతలు పెరగడంతో యూపీ దేశానికి ‘గ్రోత్ ఇంజిన్’గా అవతరించిందని పేర్కొన్నారు. 2023-24లో సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 16 శాతంగా ఉందని, ప్రస్తుత సంవత్సరంలో 25 శాతం వృద్ధిని సాధించే మార్గంలో యుపి సిద్ధంగా ఉందని యోగి చెప్పారు.
 
వృద్ధి కేవలం అంకెల్లోనే కాకుండా విలువ జోడింపులో కూడా ఉందని, .అందువలన, వ్యవసాయం, తయారీ రెండూ ఊహించిన జివిఎ (స్థూల విలువ జోడించిన) కంటే ఎక్కువ సాధించాయని తెలిపారు. రవాణా, నిల్వ, కమ్యూనికేషన్ రంగాలలో 129 శాతం వృద్ధి నమోదైనట్లు చెప్పారు. 
 
తయారీ రంగంలో వృద్ధి  బాగా ఉన్నప్పటికీ, ముఖ్యంగా విత్తన పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడం,  విత్తన పార్కుల ఏర్పాటు, సరఫరా గొలుసు నిర్వహణను బలోపేతం చేయడం, పంటల వైవిధ్యం, ఉద్యానవనాల కోసం ‘ఒక బ్లాక్ వన్ క్రాప్’ పథకాన్ని అమలు చేయడం కోసం వ్యవసాయంలో కొత్త పెట్టుబడిని ఆకర్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
 
రాష్ట్రంలో పెట్టుబడుల పట్ల చాలామంది పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారని చెబుతూ జౌళి పార్కులు, సోలార్ పార్కులు, రిక్రియేషన్ పార్కుల ఏర్పాట్లు పట్ల చాలామంది ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని అందుబాటులో ఉంచటం చాల అత్యవసరమని చెబుతూ అందుకోసం అందరూ అదనపు ప్రయత్నాలు చేయాలని ఆదిత్యనాథ్ కోరారు.
 
 పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం భూమి అవసరాన్ని పరిష్కరించడానికి గ్రామ సమాజ భూమిని ఉపయోగించుకొనే ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.  అంతేకాకుండా భూమికి సంబంధించిన వివాదాలను సకాలంలో పరిష్కరించాలని తెలిపారు. భూమి కేటాయించినా ఉపయోగించని సందర్భాలను గుర్తించి సత్వరం తగు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఖాయిలా పడిన పరిశ్రమలను గుర్తించి, వాటి పునరుద్దరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.
 
పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అవనుమతులను నిర్ణీత కాలంలో ఇవ్వాలని అంటూ నిర్ణీత కాల వ్యవధి దాటితే అనుమతి ఇచ్చిన్నట్లే పరిగణించాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుల విభాగం క్రియాశీలంగా పనిచేయాలని తెలిపారు.
 
 ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం అత్యల్ప స్థాయి పాలనకు చేరుకోవాలని పేర్కొంటూ ఈ లక్ష్యం నెరవేరాలంటే గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ సంస్థలు స్వావలంబన సాధించాలని ఆదిత్యనాథ్ సూచించారు. రాష్ట్రం కూడా టూరిజంపైనే ఆశలు పెట్టుకుందని చెబుతూ 2025 ప్రారంభంలో జరగనున్న మహాకుంభంతో, ఈ ఏడాది యూపీకి వచ్చిన పర్యాటకుల సంఖ్య 62 కోట్ల మందని అధిగమించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.