ఇసుకపై సీనరేజీ, జీఎస్టీ పన్నులు రద్దు

ఇసుకపై సీనరేజీ, జీఎస్టీ పన్నులు రద్దు
ఇసుకపై ప్రస్తుతం విధిస్తున్న సీనరేజీ, జీఎస్టీ పన్నులు రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ఎమ్యెల్యేలు, ఎమ్యెల్సీ, ఎంపీలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేల నుంచి వచ్చిన సూచనలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రులు తెలిపారు. 
 
రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ సీనరేజీ అంశం లేవనెత్తారు. ‘మనం ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పాం. కాని సీనరేజీ, జీఎస్టీ పన్నుల పేరుతో అడ్డగోలుగా ఇసుక ధరలు పెంచేస్తున్నారు. ఉచితం అన్నప్పుడు ఈ పన్నులు ఎందుకో ప్రజలకు అర్థం కావడం లేదు. వాటిని తొలగిస్తే మంచిది’ అని సూచించారు. మరి కొందరు ఎమ్మెల్యేలు ఆయన్ను బలపరిచారు. 
 
దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ఇక ఇసుకపై సీనరేజీ ఉండదని అక్కడికక్కడే తేల్చిచెప్పారు. ‘సొంత అవసరాలకు తీసుకెళ్లే ఇసుకపై జీఎస్టీ సహా ఏ పన్నులూ ఉండవు. సొంత అవసరాల కోసం సొంతంగా తవ్వుకొని ట్రాక్టర్లు, ఎడ్ల బళ్లలో ఉచితంగా తీసుకెళ్లవచ్చు’ అని తెలిపారు. 
 
`అయితే, దూరంగా ఉన్నవారు ఇసుక డోర్‌ డెలివరీ కావాలనుకుంటే తవ్వకం ఖర్చు, రవాణా ఖర్చులు భరించాల్సి ఉంటుంది. తామే తీసుకెళ్తే ఏ ఖర్చులూ ఉండవు’ అని స్పష్టం చేశారు. సీనరేజీ, జీఎస్టీ తీసివేయడం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.270 కోట్ల ఆదాయం పోయినా, ఇసుక ఉచితంగా దొరకడం వల్ల నిర్మాణ కార్యకలాపాలు పెరిగితే మరో రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 
 
ఎమ్మెల్యేల విజ్ఞప్తిపై స్పందిస్తూ.. ఇళ్ల నిర్మాణంలో పునాదులు నింపుకోవడానికి వినియోగించే మట్టిని కూడా ఉచితంగా తవ్వుకుని తీసుకెళ్లవచ్చని, దానిపై కూడా ఏ పన్నులూ ఉండవని తెలిపారు. కడియం ప్రాంతంలో నర్సరీలు భారీగా వినియోగించే మట్టిపై పన్నును పెంచే ఆలోచన కూడా విరమిస్తున్నామని, గతం మాదిరిగానే ఇది రూ. 1,000గా ఉంటుందని కూడా వెల్లడించారు. 
 
నదులకు సంబంధించిన ఇసుక రేవుల్లో ఇసుకను తవ్వి లోడ్‌ చేయడానికి కొన్ని ఏజెన్సీలను ఎంపిక చేశామని, ముఖ్యమంత్రి తాజాగా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో వీటిని ఏం చేయాలన్నదానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ సమావేశం అనంతరం తెలిపారు. ఇసుక రవాణా చేసే వాహనాలపై ఓవర్‌ లోడ్‌ పేరుతో వేసే పెనాల్టీలు కూడా ఉండబోవని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులకు చెప్పారు.