నిరుద్యోగులకు కేంద్రం త్వరలో స్పెషల్ ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌

నిరుద్యోగులకు కేంద్రం త్వరలో స్పెషల్ ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌

దసరా పండుగ సందర్భంగా నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో కోట్లాది సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువత కోసం ఓ సరికొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది. గత బడ్జెట్‌లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగుల కోసం పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. శనివారం సాయంత్రం 5 గంటలకు ఈ స్క్‌మ్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌ను కేంద్రం ప్రారంభించబోతోంది.

ఇంటర్న్‌షిప్‌ చేయాలనుకునే నిరుద్యోగులు ఆ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు.  పీఎం ఇంటర్న్ షిప్ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కేంద్రం కొన్ని అర్హతలను నిర్ణయించింది.  ఆ ప్రకారం అభ్యర్థి ఎలాంటి ఫుల్ టైమ్ కోర్సులకు దరఖాస్తు చేసుకుని ఉండకూడదు. 21-24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు మాత్రమే అర్హులు. ఎక్కడా ఫుల్ టైమ్ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు.

అలాగే కుటుంబంలో తల్లితండ్రులు కానీ, భార్య లేదా భర్త కానీ ప్రభుత్వ ఉద్యోగులై ఉండవద్దు. అదేవిధంగా కుటుంబంలో ఏ ఒక్కరికీ ఏడాదికి రూ.8 లక్షలకు మించి ఆదాయం ఉండకూడదు.ఇంటర్న్‌షిట్‌ చేయాలనుకునే నిరుద్యోగులు ముందుగా వెబ్‌సైట్ లోకి వెళ్లాలి. అందులో యూత్ రిజిస్ట్రేషన్ ఐకాన్ ప్రెస్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వారికి కేంద్రం దేశంలోనే టాప్ కంపెనీల్లో ఏడాదిపాటు ఇంటర్న్ షిప్ చేసే అవకాశం కల్పిస్తుంది.

నెలకు రూ.4500 కేంద్రం, మరో 500 సదరు సంస్థ ట్రైనీలకు చెల్లిస్తాయి. అదేవిధంగా ఏడాదిలో ఒకసారి 6 వేల రూపాయలను ఇన్సిడెంటల్ ఎక్స్‌పెన్స్‌గా చెల్లిస్తారు. అంతేగాక ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రతి ఇంటర్న్‌కు బీమా కవరేజీ కల్పించనున్నారు.