తమిళనాడు రైలు ప్రమాదంపై ఎన్ఐఏ దర్యాప్తు

తమిళనాడు రైలు ప్రమాదంపై ఎన్ఐఏ దర్యాప్తు
* ప్రమాదాల వెనుక ఉగ్రవాదుల హస్తం?
తమిళనాడులో భాగమతి ఎక్స్​ప్రెస్​ రైలు ప్రమాద ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ చేపట్టింది. శనివారం ఉదయం ఘటనాస్థలికి ఎన్​ఐఏ అధికారులు వెళ్లి పరిశీలించారు. చెన్నై సమీపంలోని పొన్నేరి ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం రైలు పట్టాలపై దుండగులు వేసిన వైర్లు, సిగ్నల్ బోర్డులపై పెట్టిన హుక్స్​ను గుర్తించి రైల్వే సిబ్బంది గుర్తించి సరిచేశారు.

అప్పుడే కుట్ర జరిగి ఉంటుందనే అనుమానంతో ఇప్పుడు ఎన్​ఐఏ అధికారులు విచారణ చేపట్టారు. తమిళనాడు రైలుప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు దక్షిణ రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఆర్ ఎన్ సింగ్‌ తెలిపారు. సిగ్నల్‌, మార్గం మధ్య మిస్‌ మ్యాచ్‌ ప్రమాదానికి కారణమైందని చెప్పారు. మెయిన్‌ లైన్‌లోకి వెళ్లేలా సిగ్నల్‌ ఇచ్చినప్పటికీ ట్రాక్‌ మాత్రం రైలును క్లోజ్డ్‌ లూప్‌ వైపు మళ్లించిందని వెల్లడించారు.

ఎక్కడో జరిగిన తప్పు కారణంగానే గూడ్స్‌ రైలు ఆగి ఉన్న ట్రాక్‌ పైకి ఎక్స్‌ప్రెస్‌ రైలు వెళ్లినట్లు దక్షిణ రైల్వే జీఎం తెలిపారు. అయితే కచ్చితంగా ఏం జరిగిందనేది ఇప్పుడే చెప్పటం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

రైలు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని రైల్వే భద్రతా విభాగానికి చెందిన సీనియర్‌ అధికారుల బృందం సందర్శించింది. అక్కడి పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలించింది. ట్రాక్‌తోపాటు పాయింట్లు, బ్లాక్స్‌, సిగ్నళ్లను, స్టేషన్‌లోని ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ సిస్టం, కంట్రోల్‌ ప్యానల్స్‌, భద్రతకు సంబంధించిన ఇతర ముఖ్యమైన అంశాలను రైల్వే భద్రతా విభాగం అధికారులు పరిశీలించారు.

మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్‌ (12578) రైలు వేగంగా వచ్చి తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలును శుక్రవారం రాత్రీ ఢీకొంది. 13 వరకు కోచ్‌లు పట్టాలు తప్పాయి. కొన్ని చెల్లాచెదురుగా పడిపోగా, మరికొన్ని ఒకదాని పైకి మరొకటి ఎక్కాయి.nసమీప గ్రామాల్లోని ప్రజలు, వివిధ శాఖల సహాయక సిబ్బంది పరుగున వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులెవరూ మరణించలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది.

ఇలా ఉండగా, దేశంలో వరుసగా రైలు ప్రమాద ఘటనలు చోటు చేసుకొంటుండటం, పలు చోట్ల రైలు భోగీలు పట్టాలు తప్పే విధంగా పట్టాలపై అడ్డంకులు ఏర్పర్చుతూ ఉండటం గమనిస్తుంటే విద్రోహ చర్యలనే అనుమానాలు కలుగుతున్నాయి.  ఒడిశాలోని బాల్ సోర్ రైలు ప్రమాదానికి తాజాగా జరిగిన బెంగళూర్ – దర్బంగా రైలు ప్రమాదానికి దగ్గర పోలికలు ఉన్నాయని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉండి ఉండే అవకాశముందని భారతీయ రైల్వే అనుమానిస్తుంది. ఆ క్రమంలో ఆ డివిజన్‌లోని కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సీఆర్ఎస్)తో అంతర్గత విచారణకు భారతీయ రైల్వే ఆదేశించింది. అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో దర్యాపు చేయించేందుకు సద్ధమైంది. కేవలం రైల్వే ఉద్యోగి వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేకుంటే సిగ్నల్ హ్యాక్ చేయడం ద్వారా కావాలని ఈ ప్రమాదం చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు భారతీయ రైల్వే వివరణ ఇచ్చింది.
ఒడిశాలోని బాల్‌సోర్‌లో ఘోర రైలు ప్రమాదంలో సైతం లూప్‌లైన్‌లో ఆగి ఉన్న రైలును ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వందలాది మంది మరణించగా.. వేలాది మంది గాయపడ్డారు.  బెంగళూరు – దర్బంగా మధ్య నడుస్తున్న ఈ రైలు సైతం దాదాపుగా అదే తరహాలో చోటు చేసుకుంది.
మరోవైపు ఇటీవల రైలు ట్రాక్‌లపై సిమెంట్ దిమ్మలు, గ్యాస్ సిలండర్‌లు, ఇనుప రాడ్లను ఉంచి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటి వేళ లోకో పైలట్లు వెంటనే అప్రమత్తమై  అత్యవసర బ్రేకులను ఉపయోగించి రైళ్లను నిలిపివేస్తున్నారు. బెంగళూరు – దర్బంగా ఎక్స్ ప్రెస్ రైలు దుర్ఘటన సైతం లోకో పైలెట్ అప్రమత్తతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగింది.
ఎక్స్‌ప్రెస్ రైలు లూప్‌లైన్‌లోకి వచ్చిన విషయాన్ని లోకో పైలెట్ వెంటనే గ్రహించాడు. ఆ క్రమంలో అత్యవసర బ్రేకులు వేసే సరికి బోగీలు పట్టాలు అయితే తప్పాయి కానీ ఎటువంటి ప్రాణ నష్టం కానీ జరగకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ రైలు ప్రమాదాలపై సర్వత్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  అదీకాక గతంలో బాల్‌సోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఉగ్రవాద మూలలున్నాయనే ఓ ప్రచారం సైతం గట్టిగానే సాగింది.