వాల్మీకి స్కాంలో అసలు సూత్రధారి మాజీ మంత్రి నాగేంద్ర

వాల్మీకి స్కాంలో అసలు సూత్రధారి మాజీ మంత్రి నాగేంద్ర

కాంగ్రెస్‌ పాలిత కర్ణాటకలో వెలుగుచూసిన ‘వాల్మీకి’ కుంభకోణం వెనుక అసలు మాస్టర్‌మైండ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ శాఖ మాజీ మంత్రి బీ నాగేంద్రేనని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం వెల్లడించింది. బెంగళూరులోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో ఈ మేరకు ఇటీవలే ఛార్జిషీట్‌ దాఖలు చేసినట్టు గుర్తు చేసింది. 

రూ. 187 కోట్ల విలువైన ఈ స్కామ్‌లో నాగేంద్రతో పాటు మరో 24 మంది పాలు పంచుకొన్నారని తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి, మధ్యవర్తి సత్యనారాయణ వర్మ, ఫస్ట్‌ ఫైనాన్స్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ ఛైర్మన్‌ ఏటకారి సత్యనారాయణ, వాల్మీకి కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ జేజీ పద్మనాభ, అధికారులు నాగేశ్వరరావు, నెక్కెంటి నాగరాజు, విజయ్‌కుమార్‌ గౌడ తదితరులు ఈ జాబితాలో ఉన్నట్టు పేర్కొంది. 

నాగేంద్ర కనుసన్నల్లోనే వాల్మీకి కార్పొరేషన్‌ నుంచి రూ. 187 కోట్లు పక్కదారిపట్టినట్టు వివరించింది. ఇందులో రూ. 20.19 కోట్లను ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బళ్లారి నియోజకవర్గంలో వినియోగించినట్టు తెలిపింది. ఈ స్కామ్‌కు సంబంధించి బుధవారం ఈడీ ప్రాసిక్యూషన్‌ కైంప్లెంట్‌ దాఖలు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచడం కోసమే ‘వాల్మీకి కార్పొరేషన్‌’ నిధులను అక్రమంగా వాడుకొన్నట్టు ఈడీ, సిట్‌ విచారణలో ప్రాథమికంగా తేలింది.

నిధుల బదిలీని వాల్మీకి కార్పొరేషన్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖరన్‌ తొలుత వ్యతిరేకించడంతో ఆయన్ని తప్పించినట్టు సమాచారం. దీంతో ఆయన గత మే 26న ఆత్మహత్య చేసుకొన్నారు.  అయితే, తన మరణ వాంగ్మూలంలో స్కామ్‌కు సంబంధించిన కీలక వివరాలను బయట పెట్టడంతో ఈ స్కామ్ గుట్టురట్టయింది. దీంతో విచారణ జరిపిన ఈడీ కుంభకోణంలో భాగమైన మాజీ మంత్రి నాగేంద్ర, వాల్మీకి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బసనగౌడ దద్దల్‌, మరో ఇద్దరు బ్యాంకు అధికారులు సహా 11 మందిని అరెస్ట్‌ చేసింది.

‘వాల్మీకి స్కామ్‌’ విచారణపై కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ రెండో ఛార్జిషీట్‌లో కుంభకోణంలో ప్రధాన నిందితులైన మాజీ మంత్రి నాగేంద్ర, వాల్మీకి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బసనగౌడ దద్దల్‌, బ్యాంకు ప్రధానాధికారి పేర్లను తొలి ఛార్జీషీట్‌లో ప్రస్తావించినా శివమొగ్గ జిల్లా కోర్టుకు ఇటీవల సమర్పించిన రెండో ఛార్జీషీట్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం.

దీంతో మాజీ మంత్రి నాగేంద్ర, కార్పొరేషన్‌ ఛైర్మన్‌తో పాటు ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్న యూబీఐ బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ను కాపాడటానికే సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.  వాల్మీకి కార్పొరేషన్‌ నుంచి దారిమళ్లిన మొత్తం రూ. 187 కోట్లలో తెలుగు రాష్ర్టాలకు రూ. 90 కోట్లు చేరినట్టు సిట్‌ అంతర్గత నివేదికలో వెల్లడించింది. ఇందులో రూ. 44.6 కోట్లు హైదరాబాద్‌కు చెందిన తొమ్మిది కంపెనీల బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్టు వివరించింది.