ఆలయాల సొమ్ము సగం రేవంత్ ప్రభుత్వ ఖజానాకే

ఆలయాల సొమ్ము సగం రేవంత్ ప్రభుత్వ ఖజానాకే
 
* సీజీఎఫ్‌ వాటా 12 శాతం పెంపు
 
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు పరచలేక, రాష్ట్రాన్ని అప్పులమయం కావిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదనపు నిధుల కోసం సామాన్యులు, సంపన్నులకే కాకుండా దేవాలయాల ఆదాయంపై కూడా కన్నువేసింది.  దేవాలయాల ఆదాయంపై  మరో 7% పన్ను విధించాలని నిర్ణయించారు.  ఇప్పటికే 5% ఉన్న కామన్‌ గుడ్‌ ఫండ్‌ (సీజీఎఫ్‌) కాంట్రిబ్యూషన్‌ను ఏకంగా 12 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిశ్చయించింది.
ఆదాయం ఆధారంగా ఆయా దేవాలయాలను నాలుగు రకాలుగా విభజించి, నాలుగు స్లాబుల్లో (5, 7, 10, 12 శాతాల్లో ) సీజీఎఫ్‌ వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సీజీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌ పెంపు ద్వారా వసూలయ్యే మొత్తాన్ని చిన్న దేవాలయాల కోసం ఖర్చు పెట్టనున్నట్టు దేవదాయశాఖ వర్గాలు తెలిపా యి

అసలు సీజీఎఫ్‌ కాంట్రిబ్యూషనే రాజ్యాం గ విరుద్ధమని ధార్మిక సంఘాలు వాదిస్తున్న నేపథ్యంలో, దానిని 12 శాతానికి పెంచడం తీవ్ర విమర్శలకు కారణమవుతున్నది. ‘రాష్ట్రంలో ఎక్కడా చర్చీలు, మసీదుల ఆదాయం పై పన్ను లేదు. అలాంటప్పుడు దేవాలయాల నుంచి మాత్రం ఎట్లా వసూలు చేస్తారు?’ అని ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

‘భక్తులు హుండీలో వేసే కానుకలు, కొనుగోలు చేసే టికెట్లతోనే ఆలయానికి ఆదాయం సమకూరుతుంది.ఒకసారి భక్తులు ముడుపును సమర్పించారంటే ఆ సొమ్ము దేవుడిదేనన్నమాట. అటువంటి దేవుని సొమ్ముపై కాంట్రిబ్యూషన్‌ పేరుతో పన్ను వేయడం దారుణం. అయినా ఉన్న దేవుడి సొమ్మును తీసి లేని దేవుడికి ఇస్తామని చెప్పడానికి సర్కారు ఎవరు?’ అని ప్రధాన దేవాలయానికి చెందిన అర్చకుడొకరు ఆగ్రహం వ్యక్తంచేశారు.

టెంపుల్‌ టూరిజం ద్వారా, భక్తుల ద్వారా సర్కారుకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. ఈ నేపథ్యంలో సర్కారు సొమ్ముతో దేవాలయాలను అభివృద్ధి చేయాల్సింది పోయి, దేవుడి సొమ్ము నుంచి వసూళ్లేమిటి? ఆలయాలకు వస్తున్న ఆదాయంలో గండికొట్టడం ఏమిటనే అభ్యంతరం వ్యక్తమవుతున్నది.  రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు ఏర్పాటైనప్పటినుంచి ఆలయాలకు ఒక్కపైసా ఖర్చుచేసిన దాఖలాలు లేదు. ఆలయాల అభివృద్ధికి నయాపైసా వెచ్చించకపోగా, ధూప దీప నైవేద్యం స్కీమ్‌లో ఒక్క ఆలయాన్ని కూడా చేర్చలేదు. అంతేకాదు, డీడీఎన్‌ ఆలయాలకు వేతనాలు సక్రమంగా అందడం లేదు.

పుండు మీద కారం చల్లిన చందంగా సీజీఎఫ్‌ కింద ఆలయాల వాటా ను 5% నుంచి 12 శాతానికి పెంచాలని తాజాగా నిర్ణయించారు. రూ.25 లక్షలు, అంతకన్నా ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాలనుంచి 12%, అసలు ఆదాయం లేని చిన్న ఆలయాలు, మఠాల నుంచి 5% చొప్పున వసూలు చేయాలని నిశ్చయించారు. 

ఈ మేరకు ఆయా ఆలయాలు, వాటికి వస్తున్న ఆదాయాలనుబట్టి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈవోలకు ఆదేశాలు జారీచేశారు. ఈ పన్నుతో నియోజకవర్గాల వారీగా ఆదాయం లేని ఆలయాలను అభివృద్ధి చేస్తామయని చెబుతున్నారు.

హిందూ ఆలయాలు ఇప్పటికే సర్కారీ పన్నుపోటుతో సతమతమవుతున్నాయి. సీజీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌కు అదనంగా, ప్రతి దేవాలయం నుంచి ఎండోమెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఫీజు కింద 12% వసూలు చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ వేతనం కోసమని గతంలో 5% ఉన్న అడ్మినిస్ట్రేటివ్‌ ఫీజును ప్రభుత్వం మరో 7% పెంచి 12% చేసింది.

చివరికి ఆలయాల లెక్కలు చూడటం కోసమని 1.5% ఆడిట్‌ ఫీజు వసూలు చేస్తున్నది. అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ కింద 3%, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ వేతనాలు పొందుతున్న ఉద్యోగులున్న ఆలయాల్లో వారి వేతనాల కోసమని 10 నుంచి 20% వరకు ప్రభుత్వం పన్ను వసూలు చేస్తున్నది. వీటన్నింటినీ కలుపుకుంటే దేవుడి సొమ్ములో దాదాపు 45-50% దాకా సర్కారుకే జమ అవుతున్నది.

‘అసలు ఆలయాలపై సర్కారు పెత్తనాన్ని ఎవరు అడిగారు. ఆలయ సిబ్బందికి వేతనాల కోసం దేవుడి సొమ్ము వాడుతారా? ఆలయం లెక్కలు చూడటానికి దేవుడు పన్ను కట్టాలా? ప్రభుత్వంలోని మిగతా అన్ని శాఖల్లో ఉద్యోగుల వేతనాల కోసం ఆయా శాఖల నుంచి పన్ను వసూలు చేస్తున్నారా? వాటికి లేని పన్ను హిందూ దేవుళ్లపైనే ఎందుకు?’ అని ధార్మిక సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. 

మసీదులు, చర్చిలు ప్రభుత్వానికి ఎలాంటి పన్నులూ చెల్లించకున్నా వాటి అభివృద్ధికి, వేతనాలకు నిధులు కేటాయిస్తున్నారని, అదే హిందూ ఆలయాలకు వచ్చే సరికి దేవుడి సొమ్మును లాక్కుంటున్నారని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.