రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!

రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిన తొలి ఏడాదిలోనే 22.22 లక్షల మంది అన్నదాతలకు రూ.17.86 కోట్లు రుణమాఫీ చేసిందని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు సమాచారంతో లేఖ రాశారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కు మేలు చేసేందుకు  ప్రధానికి అబద్ధాలతో రాసిన లేఖపై ప్రజల సమక్షంలో చర్చకు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు. 
 
దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని చెబుతూ వేదిక ఖరారు చేయాను కోరుతూ సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్ విసురుతూ బహిరంగ లేఖ రాశారు. “తెలంగాణ రైతుల‌కు పంట‌ రుణాల మాఫీ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం  ప్రధాని మోదీకి రాసిన లేఖ కొన్ని వాస్తవాలను క‌ప్పిపుచ్చేలా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో పీసీసీ చీఫ్‌గా మీరు(రేవంత్ రెడ్డి) కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే 2023 డిసెంబర్ 09న రైతులందరికీ రూ.2లక్షల వరకూ రుణమాఫీ చేస్తామ‌ని హామీ ఇచ్చింది వాస్తవం కాదా?” అని ఆయన ప్రశ్నించారు. 
 
కానీ, అధికారం చేపట్టి 6నెల‌లైనా రుణ‌మాఫీ అమ‌లు చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల్లో ఆగ్రహం పెరిగిందని, ఇది గ్రహించిన 2024 మే నెల‌లో జ‌రిగిన‌ లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్రచారంలో 2024 ఆగస్టు 15 క‌ల్లా మాఫీ చేస్తామని కనిపించిన దేవుళ్లందరిపైనా ఒట్టు వేశారని గుర్తు చేశారు. తీరా ఆగ‌స్టు 15 క‌ల్లా  పంట రుణాల‌ను స‌గం మంది రైతుల‌కు మాత్రమే మాఫీ చేశారని పేర్కొంటూ మిగిలిని స‌గం మందికి మాఫీ చేయ‌ని మాట వాస్తవం కాదా? అని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు.

ఇదే విష‌యాన్ని ప్రధాని మోదీ అక్టోబ‌ర్ 5న మ‌హారాష్ట్రలో జ‌రిగిన ఓ బ‌హిరంగ స‌భ‌లో తెలంగాణ‌లో కాంగ్రెస్ స‌ర్కార్ ఇచ్చిన హామీ మేర‌కు రుణమాఫీ పూర్తిగా అమ‌లు చేయ‌లేద‌ని, మాఫీ కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారంటూ  వాస్తవాలను వివరించారని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలు మ‌హారాష్ట్ర రైతుల‌ను ప్రభావితం చేస్తాయని, తద్వారా ఆ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని దెబ్బతీస్తాయని అధిష్ఠానం చెప్పడంతో, వారి ఆదేశాలతోనే రుణమాఫీ విషయంలో అబద్ధాలను రంగరిస్తూ ప్రధాని మోదీకి రేవంత్ లేఖ రాశారని ఆయన ఆరోపించారు. 

మాఫీ చేశామని మీరు చెప్పడం తెలంగాణ ప్రజలనే కాకుండా దేశ ప్రజలను సైతం త‌ప్పుదోవ‌ ప‌ట్టించ‌డం.. మోసం చేయ‌డం కాదా? అంటూ ప్రశ్నించారు. బ‌హిరంగ చర్చ వద్దనుకుంటే రుణ‌మాఫీతోపాటు కాంగ్రెస్ పార్టీ రైతుల‌కిచ్చిన ఇత‌ర హామీల‌పైనా చ‌ర్చించేందుకు తక్షణమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

సీఎంకు మహేశ్వర్ రెడ్డి సంధించిన ప్రశ్నలు ఇవే

1. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే రూ.2లక్షలలోపు పంట రుణాలు ఒకే ద‌ఫాలో మాఫీ చేస్తామ‌ని టీపీసీసీ చీఫ్‌గా మీరు(రేవంత్ రెడ్డి) అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా హామీ ఇవ్వలేదా?, ప్రస్తుతం స‌గం మంది రైతుల‌కు మాఫీ కాని మాట వాస్తవం కాదా?

2. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2023 డిసెంబ‌రు 09న అర్హులైన రైతులంద‌రికీ మాఫీ చేస్తామ‌ని అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ హామీ ఇచ్చారు క‌దా? మ‌రిప్పుడు ప‌ది నెల‌లైనా ఆ హామీ పూర్తిగా అమ‌లు కాలేదన్నది వాస్తవం కాదా?

3. రూ.2లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేసేందుకు రూ.49,500కోట్లు అవసరం అవుతాయని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ(ఎస్ఎల్బీసీ) మొద‌ట్లోనే చెప్పిన మాట నిజం కాదా?

4. ఆ త‌ర్వాత‌ పంట రుణమాఫీకి రూ.40వేల కోట్లు ఖర్చవుతాయని 2024 మే ఒకటిన గాంధీ భ‌వ‌న్‌లో జ‌రిగిన కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడింది నిజం కాదా?

5. లోక్‌ స‌భ ఎన్నిక‌ల సందర్భంగా ప్రచారంలో భాగంగా 2024 ఆగ‌స్టు 15 క‌ల్లా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మీరు దేవళ్లపై ఒట్లు వేసింది వాస్తవం కాదా?

6. తర్వాత జరిగిన క్యాబినెట్ సమావేశంలో రుణ‌మాఫీకి రూ.31వేల కోట్లు అవ‌స‌ర‌మ‌ని నిర్ణయించింది నిజం కాదా?

7. కానీ, తీరా రాష్ట్ర బడ్జెట్లో రుణ‌మాఫీ పథకానికి మీరు కేటాయించింది కేవలం రూ.26వేల కోట్లు మాత్రమే. అదీ వాస్తవం కాదా?

8. 2024 జులై 18నుంచి ఆగ‌స్టు 15వ‌ర‌కు కేవ‌లం 22.22లక్షల మంది అన్నదాతలకు రూ.17.869 కోట్లు మాత్రమే మాఫీ చేసిన మాట నిజం కాదా? ఇది మొత్తం రుణమాఫీ చేయాల్సిన నిధుల్లో సగం కంటే త‌క్కువ కాదా? అంటూ పలు ప్రశ్నలు సంధించారు.