రైలును పట్టాలు తప్పించేందుకు మరోసారి కుట్ర

రైలును పట్టాలు తప్పించేందుకు మరోసారి కుట్ర

రైళ్లను పట్టాలు తప్పించేందుకు దుండగులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ట్రాక్‌లపై గ్యాస్‌ సిలిండర్లు, ఇనుప పట్టీలు ఉంచూతూ రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు పన్నుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకున్నది. ఖీరూన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రఘురాజ్‌ సింగ్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలపై ఇసుకను పోశారు.

అయితే ఇసుక కుప్పను చూసిన లోకో పైలట్‌ రైలును ఆపేయడంతో ప్రమాదం తప్పింది. ట్రాక్‌పై నుంచి దానిని తొలగించిన తర్వాత రైలు అక్కడి నుంచి వెళ్లిపోయింది.  డంపర్‌ నుంచి రైల్వే ట్రాక్‌పై ఇసుక పోశారని ఖీరోన్‌ ఎస్‌హెచ్‌వో దేవేంద్ర భడోరియా చెప్పారు. దానిని తొలగించిన తరువాత రైలు ముందుకు సాగిందని తెలిపారు.

స్థానికంగా రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా మట్టిని రవాణా చేసే పని రాత్రిపూట జరుగుతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఓ డ్రైవర్‌ డంపర్‌ నుంచి ఇసును రైల్వే ట్రాక్‌పై పోసి అక్కడి నుంచి పరారయ్యాడని చెప్పారు. అది జరిగిన కొద్దిసేపటి తర్వాత రాయ్‌బరేలీ- రఘురాజ్‌సింగ్‌ స్టేషన్‌ మధ్య నడుస్తున్న షటిల్‌ రైలు అటుగా వచ్చిందని వెల్లడించారు.

అయితే లోకోపైలట్‌ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  గత నెల 22న ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని ప్రేమ్‌పూర్‌ వద్ద జరిగింది. ప్రేమ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌పై గ్యాస్‌ సిలిండర్‌ కనిపించింది. ఆ మార్గంలో వెళుతున్న గూడ్స్‌ రైలు లోకో పైలట్‌ దీనిని గుర్తించి వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేయడంతో ప్రమాదం తప్పింది.

ట్రాక్‌పై గుర్తించిన అయిదు కిలోల సామర్థ్యం గల ఖాళీ సిలిండర్‌ను తొలగించామని స్థానిక పోలీసులు వెల్లడించారు. అలాగే గుజరాత్‌లోని కిమ్‌-కోసాంబ మధ్య కిమ్‌ వంతెన సమీపంలో సెప్టెంబర్‌ 21న పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై సేఫ్టీ పిన్‌ ఇలాస్టిక్‌ రైల్‌ క్లిప్‌ను తొలగించి, గరీబ్‌ రథ్‌ రైలును ప్రమాదానికి గురయ్యేలా చేయాలని చేసిన కుట్ర విఫలమైంది.