హైడ్రా సంస్థకు, హైదరాబాద్ ముంపు గురికాకుండా చూసేందుకు, మూసీ ప్రక్షాళనకు తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూ ముందుగా చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ సూచించారు. మూసీను కొబ్బరినీళ్లలా చేసేందుకు, ఎకలాజికల్ బాలన్స్ కాపాడడానికి, విదేశీ పక్షులు రావడానికి, చేపలు పెంచడానికి, పిల్లలు ఈతకొట్టేల చెరువులు తయారు చేయడానికి నేను వ్యతిరేకం కాదని ఆయనకు వ్రాసిన బహిరంగలేఖలో తెలిపారు.
చెరువు కన్నతల్లి లాంటిదని అభివర్ణిస్తూ హైదరాబాద్‌లో ఉన్న ఏ చెరువు కూడా పక్షులకు, చేపలకు నిలయంలాగా లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కన్నతల్లి లాంటి ప్రేమను పంచి పాలలాంటి నీళ్లను ఇచ్చి జీవం పోసిన చెరువు ప్రస్తుతం భూగర్భంలో విషాన్ని నింపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి దుర్వాసననిస్తుందని, ఆయా పరిసర ప్రాంతాల్లో ప్రజల రోగాలకు నిలయంగా మారిందని పేర్కొన్నారు.
ముందుగా దుర్గంధం తొలగించకుండా 4 దశాబ్దాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లో, ప్రభుత్వం అనుమతించిన లే అవుట్‌లలో ఇల్లు నిర్మించుకున్న నిరుపేద ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ ముఖ్యమంత్రి చేస్తున్న అడ్డగోలు కూల్చివేతలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ఎంపీ ఈటల కుండ బద్దలు కొట్టారు. చట్టప్రకారం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలంటూ సీఎం రేవంత్‌కు ఈ సందర్బంగా ఈటల రాజేందర్ సూచించారు.
పదేళ్ళున్న కేసీఆర్ మూసీ ప్రక్షాళన చేస్తానని చేయలేదని గుర్తు చేశారు. మీరు మూసీ ప్రక్షాళన చేస్తానంటే అడ్డుకోమని స్పష్టం చేశారు. అయితే, పట్టా భూములను కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటున్న వారిని బఫర్ జోన్ పేరుతో అక్రమంగా కట్టుకొని ఉంటున్నారని చిత్రీకరించడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. పిడికెడు అక్రమ ఇళ్లను బూచిగా చూపి కోట్ల విలువ చేసే ఇళ్లను కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్యూటిఫికేషన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా? మూసీ ప్రక్షాళనకి మీ యాక్షన్ ప్లాన్ ఏమిటీ? డీపీఆర్ ఉందా? ఇళ్ళు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి ? కోట్ల విలువ చేసే ఇల్లు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తా అంటే ఎలా? అని రాజేందర్ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
సబర్మతి నది ప్రక్షాళనకి రూ. 2 వేల కోట్లు, నమో గంగ ప్రాజెక్ట్‌కి 12 ఏళ్లలో రూ. 22 వేల కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు మాత్రం రూ. లక్షా 50 వేల కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? ఇంతకీ ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు ? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.
More Stories
కాచిగూడ రైల్వేస్టేషన్లో జనఔషధి కేంద్రం
21, 22లలో హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అరెస్ట్