22న కృష్ణాతీరంలో 5వేల డ్రోన్ల‌ ప్రదర్శన

22న కృష్ణాతీరంలో 5వేల డ్రోన్ల‌ ప్రదర్శన

కృష్ణా న‌ది తీరంలో ఈ నెల 22న భారీ స్థాయిలో డ్రోన్ షో నిర్వహించ‌నున్న‌ట్లు పెట్టుబడులు మౌలిక స‌దుపాయాల శాఖ కార్యద‌ర్శి సురేష్ కుమార్‌ వెల్లడించారు. ఆదివారం ఫైబ‌ర్‌ నెట్ కార్యాల‌యంలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న 22, 23 తేదీల్లో అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌ -2024 జాతీయ స‌ద‌స్సును ప్రతిష్టాత్మకంగా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

ఇప్పటి వ‌ర‌కు దాదాపు 2500 డ్రోన్లతోనే ఇలాంటి ప్రద‌ర్శన చేశార‌ని, అయితే ఇప్పుడు అంత‌కు రెట్టింపు స్థాయిలో ఈ షోను రికార్డు స్థాయిలో నిర్వహించ‌బోతున్నట్లు తెలిపారు. ఈ షో తిల‌కించ‌డానికి ప్రజ‌లందరూ రావొచ్చ‌ని చెబుతూ  22న మంగ‌ళ‌గిరిలోని సీకే క‌న్వెన్షన్ లో ఈ స‌ద‌స్సు జ‌రుగుతుంద‌ని వివరించారు. ఈ మేరకు డ్రోన్‌ సమ్మిట్‌ లోగో, వెబ్‌సైట్‌లను ఆవిష్కరించారు.

దీనిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తార‌ని, కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కె.రామ్మోహ‌న‌నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటార‌ని చెప్పారు. రాష్ట్ర పెట్టుబ‌డులు, మౌలిక‌స‌దుపాయ‌ల శాఖ మంత్రి బీసీ జ‌నార్థన‌రెడ్డి కూడా స‌ద‌స్సులో పాల్గొంటార‌న్నారు. డ్రోన్ కేపిటల్గా ఏపీ మారాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పమని, దీన్ని నెరవేర్చడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

డ్రోన్ సాంకేతికత – వినియోగం, దానివల్ల ఎదురయ్యే సవాళ్లు వంటి అనేక అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు డ్రోన్ కార్పొరేష‌న్ ఎండీ కె. దినేష్ కుమార్ తెలిపారు. డ్రోన్లలో తీసుకురావాల్సిన నూతన టెక్నాలజీ సహా అధ్యయనం పై సమ్మిట్లో నిపుణులతో చర్చిస్తామన్నారు. 
 
ఏ విభాగాల్లో డ్రోన్లు వాడి మెరుగైన సేవలు పొందవచ్చనే విషయాలపై ఇప్పటికే అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నామని తెలిపారు. వీటి రూపకల్పనపై సమ్మిట్లో చర్చిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డ్రోన్ తయారీ సంస్థలు, డ్రోన్ తయారీ నిపుణులు సమ్మిట్లో పాల్గొంటారని తెలిపారు.
 
అత్యాధునిక సేవలందించే డ్రోన్లు తయారు చేసిన వారికి ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించారు. ఎంపికైన డ్రోన్లకు తొలి బహుమతిగా రూ. 3 లక్షలు, రెండో బహుమతి రూ. 2 లక్షలు, మూడో బహుమతి 1లక్ష రూపాయలు బహుమతి ఇస్తామని వివరించారు.