మూసీ బాధితులు రేవంత్ ను మెచ్చుకుంటే రాజకీయాలకు స్వస్తి!

మూసీ బాధితులు రేవంత్ ను మెచ్చుకుంటే రాజకీయాలకు స్వస్తి!
మూసీ బాధితుల‌ను కావాల‌నే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హ‌రీశ్‌రావు, బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ రెచ్చ‌గొడుతున్నార‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం పట్ల ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మూసీ బాధితుల‌ను తాను రెచ్చ‌గొడుతున్నాను క‌దా.. మీరు చేస్తున్న‌ది మంచి ప‌ని అని మూసీ బాధితులు మిమ్మ‌ల్ని మెచ్చుకుంటే బ‌హిరంగంగా ముక్కు నేల‌కు రాసి, రాజ‌కీయాల నుంచి శాశ్వ‌తంగా త‌ప్పుకుంటాన‌ని రేవంత్ రెడ్డికి ఈట‌ల స‌వాల్ విసిరారు.
 
“రేవంత్ రెడ్డికి స‌వాల్ చేస్తున్నా.. నీకు నిజంగా ద‌మ్ము, ధైర్యం ఉంటే.. ఎలాంటి భ‌ద్ర‌త లేకుండా మ‌న ఇద్ద‌రం క‌లిసి మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో ప‌ర్య‌టిద్దాం. నీవు ఇవాళ ఏ ఇండ్లు అయితే కూల‌గొడుతున్నావో.. అక్క‌డికి ఇద్ద‌రం క‌లిసి పోదాం. మీరే తేదీ చెప్పండి.. త‌ప్ప‌కుండా పోదాం” అంటూ సవాల్ చేశారు. 
 
చైత‌న్య‌పురి, ఫ‌ణిగిరి కాల‌నీల ప్ర‌జ‌లు క‌న్నీళ్లు పెడుతున్నారు. రేపోమాపో డెలివ‌రీ అయ్యే ఓ తొమ్మిది నెల‌ల గ‌ర్భిణీ స్త్రీని ప‌ట్టుకుని.. నువ్వు ఈ ఇల్లును ఖాళీ చేసి వెళ్లిపోవాల‌ని అధికారులు ఆదేశించారు. ఒక వేళ ఇల్లు ఖాళీ చేయ‌క‌పోతే ఇప్పుడిస్తున్న డ‌బుల్ బెడ్రూం ఇల్లు కూడా రాద‌ని ఆ గ‌ర్భిణిని భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తూ పోలీసులు బ‌ల‌వంతంగా నెట్టేశారని ఆయన ఆరోపించారు. 
 
మ‌రి నేను డెలివ‌రీ ఎక్క‌డ కావాల‌ని కాళ్ల మీద ప‌డితే.. పోలీసులు క‌నిక‌రించ‌లేదని రాజేందర్ మండిపడ్డారు. చైత‌న్య‌పురి, కొత్త‌పేట‌, రామంతాపూర్.. ఎక్క‌డికి వ‌స్తావో రా పోదాం. శ‌భాష్ రేవంత్ రెడ్డి అని మూసీ బాధితులు అంటే నేను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని, బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పి ముక్కు నేల‌కు రాస్తా అని ఈట‌ల స్ప‌ష్టం చేశారు.
 
కాగా, ఓ ఆర్ఆర్ నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌) వరకు ప్రధానమైన నాలుగు రహదారులు విస్తరణ విషయంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం లేదా భూమి కేటాయించాలని మల్కాజ్‌గిరి ఎంపీ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భూ నిర్వాసితులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హెచ్చరించారు. 
 
పేద రైతుల స్థలాలను గుంజుకుని రైతులను బిచ్చగాళ్లను చేస్తానంటే ఎవరు ఊరుకోరని ఆయన హెచ్చరించారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ ధర్నాచౌక్‌లో ట్రిపుల్‌ ఆర్‌ రోడ్డు విస్తరణ సందర్భంగా భూనిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ట్రిపుల్‌ ఆర్‌ భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.