చైనా సీసీటీవీ కెమెరాలు, ఇతర నిఘా పరికరాలపై ఆంక్షలు!

చైనా సీసీటీవీ కెమెరాలు, ఇతర నిఘా పరికరాలపై ఆంక్షలు!
లెబనాన్‌లో ఒకేసారి వందలాది పేజర్లు పేలిపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఎలక్ట్రానిక్‌ పరికరాలు శత్రువుల చేతిలో ఆయుధాలుగా మారే ముప్పు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలో తయారైన సీసీటీవీ కెమెరాలు, ఇతర నిఘా పరికరాల వినియోగంపై భారత్‌లో ఆంక్షలు విధించాలని భావిస్తున్నది.

ఈ మేరకు అక్టోబర్‌ 8 నుంచి కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. చైనా తయారీ పరికరాలపై ఆంక్షలతో పాటు దేశంలో తయారైన వాటినే వినియోగించేలా ఈ విధానం ఉండనుంది. నిజానికి ఇందుకు సంబంధించిన గెజిట్‌ గతంలోనే వచ్చినప్పటికీ లెబనాన్‌లో పేజర్ల పేలుళ్ల నేపథ్యంలో ఇప్పుడు అమలులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. 

కీలక ప్రాంతాల్లో అమర్చే సీసీటీవీల ద్వారా ప్రజల కదలికలు, ఇతర డాటా బయటికి లీక్‌ అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌లోనే పూర్తిస్థాయిలో తయారయ్యే పరికరాలను మాత్రమే వినియోగించేలా ఈ విధానంలో చర్యలు తీసుకోనుంది. 

ప్రస్తుతం భారత మార్కెట్‌లో సీపీ ప్లస్‌, హిక్‌విజన్‌, దహువా కంపెనీలు 60 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉన్నాయి. వీటిల్లో సీపీ ప్లస్‌ భారత్‌కు చెందిన కంపెనీ కాగా, మిగతా రెండు చైనా సంస్థలు. ఇప్పటికే అమెరికా సైతం ఈ కంపెనీల పరికరాల వినియోగంపై ఆంక్షలు విధించింది. దేశంలో పలు విమానాశ్రయాలు వంటి కీలక ప్రదేశాలలో అమర్చిన సిసిటివి కెమెరాలలో చైనా కంపెనీలవి ఉన్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి చైనా తయారీ పరికరాలపై ఇప్పటికే ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే వీటి టెండర్లు పొందుతున్న భారతీయ కంపెనీలు చైనా కంపెనీల ఉత్పత్తులను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. లెబనాన్ లో మాదిరిగా పేలుళ్లకు వీటిని ఉపయోగించే అవకాశం లేకపోయినప్పటికీ మన డేటా సమాచారం లీక్ అయ్యేందుకు వీలుందని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకనే `విశ్వసనీయమైన’ ఉత్పత్తిదారుల నుండి మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టం చేస్తున్నారు.

`విశ్వసనీయం’ అంటే వాటి ఉత్పత్తి పక్రియ పారదర్శకంగా ఉండడంతో పాటు, ప్రభుత్వంకు పర్యవేక్షించే అవకాశాలు ఉండటంగా చెబుతున్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యేవాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ ఏడాదో మొదట్లో ప్రభుత్వం రెండు నోటిఫికేషన్ లను జారీచేసింది. అయితే, ఇప్పటికే అమర్చిన సిసిటివి కెమెరాలను మార్చే ఆలోచన ప్రస్తుతం లేనప్పటికీ తర్వాత మార్చే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.