కూల్చివేతలపై రాహుల్ ఆగ్రహం… రేవంత్ ధిక్కారస్వరం!

కూల్చివేతలపై రాహుల్ ఆగ్రహం… రేవంత్ ధిక్కారస్వరం!
బిజెపి పాలిత రాస్త్రాలలో `బుల్లడోజర్ జస్టిస్’ అంటూ కూల్చివేతలు వ్యతిరేకంగా తాము పోరాటాలు చేస్తుంటే తెలంగాణాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూల్చివేతలు చేపట్టడంపై కాంగ్రెస్ అధినాయకులు, ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.  పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులు శాపనార్థాలు పెడుతుండడం, సోషల్‌ మీడియాలో వ్యతిరేక ప్రచారం పెరిగిపోవడంతో అధిష్ఠానం పెద్దలు రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. 
 
దీంతో అర్ధాంతరంగా రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి  ‘త్వరలోనే ఇతర రాష్ర్టాల్లో ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే తెలంగాణ మాదిరిగా కూల్చివేస్తదంటూ అక్కడి ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. వెంటనే హైడ్రాను, కూల్చివేతల్ని ఆపేయండి’ అని తీవ్రస్థాయిలో హెచ్చరించినట్టు తెలిసింది.
పార్టీ సీనియర్ల సలహాలు తీసుకోకుండా ఒంటెద్దు పోకడగా వెళ్ళడంపై మందలించినట్లు చెబుతున్నారు. 
 
ఈ విషయమై రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడమని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ కు రాహుల్ ఫోన్ చేసి సూచించడంతో ఆయన వెంటనే ముఖ్యమంత్రిని పిలిపించి హెచ్చరికలు చేశారు.  రేవంత్ తీరు పట్ల ఇప్పటికే అధిష్టానానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారు.  తమను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని, సీనియర్లను గౌరవించడం లేదని మొరపెట్టుకున్నారు. అందుకే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల  తీవ్ర వ్యతిరేకత మొదలైనట్లు వివరించారు.

“నీవు చేసే పనులతో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెరుగుతుంది. నీ స్వలాభం కాస్త పార్టీకి తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుంది.  కాంగ్రెస్ పార్టీ అంటే నీ ఒక్కడిది కాదు. నీవు చేసే పనులతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది” అంటూ వేణుగోపాల్ సున్నితంగా మందలించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

హైకమాండ్ ఆదేశాలు భేఖాతారు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరించారు. ఒక్కరిద్దరు చేష్టల వలన పార్టీ పరువు పోతుందని పేర్కొంటూ ముఖ్యమంత్రి  అయినా.. కార్యకర్త అయిన పార్టీ పెద్దల ఆదేశాలు అనుసరిస్తూ ముందుకు పోవాలి అంటూ స్పష్టం చేశారు.
 
మరోవంక, హైడ్రా కూల్చివేతలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడం, తమకే కాకుండా అధిష్ఠానం పెద్దలకు కూడా చెప్పకుండా హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చివేయడంపై తనను ప్రశ్నించిన మంత్రులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. అంతేకాదు, ‘అన్నీ అధిష్ఠానానికి చెప్పి చేయాల్నా’ అని ధిక్కార స్వరం వినిపించినట్టు సమాచారం. 
 
పేదల ఇండ్లను హైడ్రా బుల్డోజర్లతో తొక్కిస్తున్న రేవంత్‌రెడ్డిపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  బాధితులు శాపనార్థాలు పెడుతుంటే చివరికి సొంత పార్టీ అధిష్ఠానం, మంత్రులు సైతం రేవంత్‌ చర్యల్ని సమర్థించడం లేదు.
ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని ప్రజలు ఆగ్రహంగా ఉంటే, ఇప్పుడు ఈ కూల్చివేతలతో పార్టీ, ప్రభుత్వం ఏం కావాలని సొంత మంత్రులే ముఖ్యమంత్రిని నిలదీసినట్టు తెలిసింది.
 
సెప్టెంబర్‌ 20న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి లేచి అసలు హైడ్రా ఎందుకు?, ఈ కూల్చివేతలు ఎందుకని నిలదీసినట్టు చెప్తున్నారు. త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పెట్టుకొని బుద్ధి ఉన్నవాడెవడైనా పేదల ఇండ్ల కూల్చివేతలు పెట్టుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. 
 
పేదోడికి ఇండ్లు ఇచ్చే పార్టీగా పేరున్న కాంగ్రెస్‌, ఇప్పుడు అదే పేదోడి ఇల్లు కూల్చే పరిస్థితి రావడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారట. ఎలాగూ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే పరిస్థితిలో లేం, ఉన్న ఇండ్లను కూల్చివేయడం ఏంటని నిలదీసినట్టు తెలిసింది.