లడ్డు వివాదంపై తాత్కాలికంగా ఆగిపోయిన సిట్ దర్యాప్తు

లడ్డు వివాదంపై తాత్కాలికంగా ఆగిపోయిన సిట్ దర్యాప్తు
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక నియమించిన దర్యాప్తు బృందం (సిట్) తన దర్యాప్తును తాత్కాలికంగా నిలిపి వేసింది. ఇప్పటికే సిట్ సభ్యులు తిరుమల చేరుకుని దర్యాప్తు సైతం ప్రారంభించారు. అయితే  తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. 
 
ఈ విషయమై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందన్న ఏపీ డీజీపీ రాష్ట్ర ప్రభుత్వ తరుఫు న్యాయవాదుల సూచనతో అక్టోబర్ 3వ తేదీ వరకూ సిట్ దర్యాప్తు అపివేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ మూడో తేదీ ఈ పిటిషన్ మీద సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ తర్వాత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా సిట్ దర్యాప్తు జరపనుంది.
 
కాగా, తిరుమల లడ్డూ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు వచ్చిన సమాచారంతో ప్రకటన చేశారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. అధికారులతో సమీక్ష చేసుకున్న తర్వాతే తిరుమల లడ్డూ విషయంపై మాట్లాడి ఉంటారని ఆమె పేర్కొన్నారు. సీఎంగా ఆయన అపచారం జరిగిన విషయాన్ని ప్రజలకు తెలియ చెప్పి ఉంటారని చెప్పారు. 
 
ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనేది పరిగణలోకి కోర్టు తీసుకుంటుందని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని ‘మీరు ఎందుకు అలా మాట్లాడారు?’ అని కోర్టులకు అడిగే హక్కు ఉంటుందా? అనేది అందరూ ఆలోచన చేయాలని ఆమె సూచించారు.
 
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందనే మాట వాస్తవమని  మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ ప్రాథమిక దశలోనే ఉందన్న మంత్రి పూర్తి స్థాయి విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. కింది స్థాయి దర్యాప్తులో తేలిన అంశాలను సుప్రీంకోర్టుకు నివేదించాల్సి ఉందని చెప్పారు. 
 
తిరుపతి లడ్డూ కల్తీ ఘటనపై సిట్ బృందం ప్రాథమిక నివేదికల ఆధారంగా దర్యాప్తు చేస్తోందన్న మంత్రి కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టినా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కోర్టులపై తమకు, తమ ప్రభుత్వానికి నమ్మకం ఉందని మంత్రి చెప్పుకొచ్చారు.