జమిలి ఎన్నికలకు వీలుగా 3 బిల్లులు తెచ్చేందుకు సిద్ధం

జమిలి ఎన్నికలకు వీలుగా 3 బిల్లులు తెచ్చేందుకు సిద్ధం

దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’కు సంబంధించి, మూడు బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో రాజ్యాంగ సవరణకు సంబంధించి రెండు బిల్లులు ఉన్నట్లు తెలుస్తోంది. 

కాగా, ఈ మూడింట్లో ఒక బిల్లుకు 50శాతం రాష్ట్రాల ఆమోదం అవసరం. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’కు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించింది. ప్రతిపాదిత మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు- లోక్​సభ, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా నిబంధనలను రూపొందించడం.

అయితే, ఈ బిల్లుకు కనీసం 50 రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం లేదని సిఫారసులు పేర్కొన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ బిల్లులో ప్రతిపాదించే సవరణలు, నిబంధనలు ఇవే.

  • ఆర్టికల్ 83(2) సవరించడం.
  • లోక్​సభ వ్యవధి, దాని రద్దుకు సంబంధించిన కొత్త సబ్​-క్లాజ్​లు(2), (4)ని చేర్చడం
  • శాసనసభలను రద్దు చేయడం, ‘ఏకకాల ఎన్నికలు’ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడానికి ఆర్టికల్ 327 సవరించడం

రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన మార్పులు, సవరణ నిబంధనలు ఉన్నరెండో బిల్లును కనీసం 50శాతం రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం ఉంది.

  • స్థానిక సంస్థల ఎన్నికల కోసం, రాష్ట్ర ఎన్నికల కమిషన్​లతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్​ రోల్​​ తయడానికి సంబంధించి రాజ్యాంగ నిబంధనలు సవరించడం
  • లోక్​సభ, రాష్ట్ర శాసనసభలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా, కొత్తగా ఆర్టికల్ 342ఏ చేర్చడం.

మూడో బిల్లు సాధారణ సవరణ బిల్లు. ఇందులో, లెజిస్లేటివ్ అసెంబ్లీలు ఉన్న దిల్లీ, పుదుచ్చేరి, జమ్ముకశ్మీర్, దిల్లీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్టాల్లో సవరణలు చేసే నిబంధనలను ఉంటాయి. ఈ యూటీ అసెంబ్లీల నిబంధనలను, మొదటి రాజ్యాంగ సవరణ బిల్లులో ప్రతిపాదించిన- రాష్ట్రాల్లో శాసనసభలు, లోక్​సభ నిబంధనలతో సరచేయడానికి ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ప్రతిపాదించిన సవరణలు ఇవే

  • గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీ, 1991 చట్టాన్ని సవరించడం
  • గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్-1963ని సవరించడం
  • జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019ని సవరించడం

జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ మొత్తం 18 సవరణలు సిఫారసు చేసింది. అందులో ప్రస్తుతం ఉన్న ఆర్టికల్​లలో 12 కొత్త సబ్​ క్లాజ్​లను చేర్చడం. అసెంబ్లీలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన మూడు చట్టాలను సర్దుబాటు చేయడం ఉన్నాయి. 

అంతేకాకుండా మొదటి దశలో లోక్​సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. ఆ తర్వాత 100 రోజులకు రెండో దశలో పంచాయతీలు, మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థలకు ఎలక్షన్స్​ నిర్వహించాలని సూచించింది. ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ల మధ్య సమన్వయం కోసం ఉమ్మడి ఎలక్టోరల్​ రోల్ ఉండాలని హై లెవెల్ కమిటీ సూచించింది.