వందే భారత్‌ రైళ్ల కొనుగోలుకు కెనడా సహా పలు దేశాల ఆసక్తి

వందే భారత్‌ రైళ్ల కొనుగోలుకు కెనడా సహా పలు దేశాల ఆసక్తి
భారతీయ రైల్వేలో మోదీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో దూసుకెళ్తున్నాయి. ఈ రైళ్లకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతున్నది. ఈ క్రమంలోనే పలు దేశాలు సైతం సెమీ హైస్పీడ్‌ రైళ్లపై దృష్టి సారిస్తున్నాయి. చిలీ, కెనడా, మలేషియా వంటి దేశాలు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. 
 
దీనికి ప్రధాన కారణంగా ఖర్చు. వందే భారత్‌లో ఉన్న అత్యాధునిక సౌకర్యాలతో రైళ్లను తయారు చేసేందుకు రూ.160 నుంచి రూ.180కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. అయితే, భారత్‌లో వందే భారత్‌ రైలును తక్కువగా ఖర్చుతో తయారు చేస్తున్నారు. దాదాపు రూ.120 నుంచి రూ.130 కోట్ల వరకు ఖర్చవుతున్నది. 
 
ఇక వేగం విషయంలోనూ ఇతర దేశాలకు చెందిన రైళ్లతో పోటీపడుతున్నది. వందే భారత్‌ రైలు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని ఆదుకునేందుకు కేవలం 52 సెకన్ల సమయం పడుతున్నది.  ఇది జపాన్‌ బుల్లెట్‌ రైలు కంటే ఎక్కువ. జపాన్‌ బుల్లెట్‌ రైలు 0-100 కిలోమీటర్ల వేగాన్ని ఆదుకునేందుకు 54 సెకన్లు పడుతుంది. 
 
వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రైల్వేశాఖ తీసుకువస్తున్నది. రైలు ప్రమాణంలో వంద రెట్లు తక్కువ శబ్దం వస్తుంది. అలాగే, పవర్‌ వినియోగం తక్కువగా ఉంటుంది. ఇక భారతీయ రైల్వే వందే భారత్‌ ట్రాక్‌ నెట్‌వర్క్‌ను విసర్తించడంతో పాటు రైళ్ల సంఖ్యను పెంచాలని యోచిస్తున్నది. 
 
గత పదేళ్లలో 31వేల కిలోమీటర్లకు పైగా ట్రాక్‌లను వేసినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. దీన్ని 40 వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. బుల్లెట్‌ రైలు పనులు శరవేగంగా జరుగుతున్నాయనిపేర్కొ న్నారు. భద్రతాపరమైన ఆందోళన మధ్య రైల్వే స్వదేశీ ఆటోమేటిక్‌ రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్‌’ని సైతం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు శ్రద్ధ చూపుతున్నది. 
 
కవచ్‌ సమర్థవంతంగా సమర్థవంతంగా పని చేస్తుండగా ఎస్‌ఐఎల్‌-4 సర్టిఫికెట్‌ సైతం పొందింది. ఈ షీల్డ్‌లను అంతా ఏర్పాటు చేస్తే 80శాతం ప్రమాదాలను తగ్గించవచ్చని విలేకరులతో రైల్వేశాఖ మంత్రి తెలిపారు.