విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేనట్లేనా!

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేనట్లేనా!
ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు అంటూ సాగిన ఉద్యమం ఫలితంగా విశాఖపట్నంలో ఏర్పాటైంది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ – ఆర్ఐఎన్ఎల్). 2019లో రెండోసారి కొలువు దీరిన తర్వాత విశాఖ స్టీల్ ప్రైవేటీకరిస్తామని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆంధ్రప్రదేశ్ పౌరుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో కేంద్రం వెనుకడుగు వేసినట్లు తెలుస్తున్నది. 
 
ప్రైవేటీకరించడానికి బదులు మరో కేంద్ర ప్రభుత్వ రంగ స్టీల్ సంస్థ ‘సెయిల్’లో విశాఖ స్టీల్ విలీనం చేయడానికి గల అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నది. అందుకోసం ఫైనాన్సియల్, ఆపరేషనల్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నది.  ఇందులో భాగంగా ఆర్ఐఎన్ఎల్ కార్యకలాపాల నిర్వహణకు కేంద్రం నిధులు సమకూరుస్తుంది. 
 
బ్యాంకు రుణాల పరిష్కారంతోపాటు విశాఖ స్టీల్ ఆధీనంలో ఉన్న భూమిని ఎన్ఎండీసీకి విక్రయించే యోచనలో కేంద్రం ఉందని తెలుస్తున్నది. ఈ విషయమై ఇటీవలే డీఎఫ్ఎస్ కార్యదర్శి, స్టీల్ కార్యదర్శి, ఎస్బీఐ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఆర్ఐఎన్ఎల్‌కు గణనీయ స్థాయిలో రుణాలిచ్చిన బ్యాంకుల్లో ఎస్బీఐ ఒకటి. విశాఖ స్టీల్‌కు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా కేంద్రం అడుగులేస్తున్నదని అధికార వర్గాలు తెలిపాయి. అందులో సెయిల్‌లో ఆర్ఐఎన్ఎల్ విలీనం ఒక ఆప్షన్ అని ఆ వర్గాల కథనం.ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో స్టీల్ శాఖ ఆధీనంలో పని చేయడంతోపాటు 75 లక్షల టన్నుల స్టీల్ ఆపరేటింగ్ సామర్థ్యం గల ప్లాంట్ ‘రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్). దేశంలోనే సముద్ర తీరాన్నే కొలువుదీరిన తొలి సమగ్ర స్టీల్ ప్లాంట్ ఇది. స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కూడా స్టీల్ శాఖ ఆధీనంలోనే ఉంటుంది. 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని గతంలో నిర్ణయించగా, దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణ బదులుగా విలీనం ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తిని పెంచేందుకు రూ.2500 కోట్లు నిధులు కేటాయించాలని కేంద్రం ఇటీవలే నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్’కు అవసరమైన నిధులు సమకూర్చేందుకు రుణ దాతలతో సంప్రదించడంతోపాటు సంస్థకు గల 1500-2000 ఎకరాల భూమిని ఎన్ఎండీసీకి పెల్లెట్ ప్లాంట్ కోసం విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం మరొక ఆప్షన్. క్యాప్టివ్ ఐరన్ ఓర్ గనులను కేటాయిస్తే విశాఖ స్టీల్’కు అప్పుల బాధ తప్పుతుందని విశాఖ స్టీల్ కార్మికుల సంఘం నాయకులు చెబుతున్నారు.  ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో అధిక ధరకు ఐరన్ ఓర్ కొనుగోలు చేస్తున్నారు.

2021 జనవరిలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సూత్రప్రాయంగా ‘విశాఖ స్టీల్’ను 100 శాతం ప్రైవేటీకరించేందుకు ఆమోదం తెలిపింది. విశాఖ స్టీల్ అనుబంధ సంస్థల్లో ఆ సంస్థ వాటాలను వ్యూహాత్మకంగా తగ్గిస్తూ ప్రైవేటీకరించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది. బ్యాంకుల వద్ద విశాఖ స్టీల్ తీసుకున్న రూ.35 వేల కోట్ల రుణాలు దాదాపు మొండి బకాయిలుగా ఉన్నట్లు తెలుస్తోంది.