తిరుమల లడ్డూపై ‘సుప్రీం’లో సుబ్రహ్మణ్య స్వామి, సుబ్బారెడ్డి పిల్‌

తిరుమల లడ్డూపై ‘సుప్రీం’లో సుబ్రహ్మణ్య స్వామి, సుబ్బారెడ్డి పిల్‌

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణ దుమారం రేపుతోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించగానే ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. టిటిడి ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్, వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి ఒకరు కాగా, మాజీ కేంద్ర మంత్రి డా. సుబ్రమణియన్ స్వామి మరొకరు.

వీరిద్దరూ విడివిడిగా దాదాపు ఒకే విధంగా సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. తిరుమల లడ్డుపై సిఎం చంద్రబాబు నాయుడు చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై విచారణ చేపట్టాలని సుబ్రహ్మణ్యస్వామి కోరుతూ పిల్ వేశారు. వైవి. సుబ్బారెడ్డి కూడా విచారణ కోరతూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా హైకోర్టు కూడా వైవి.సుబ్బారెడ్డి పిటిషన్ పై విచారణ చేపట్టింది.

ఆరోపణలపై క్షుణ్ణంగా విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానంలో పర్యవేక్షణలో ఉండే కమిటీని నియమించేందుకు ‘రిట్‌ ఆఫ్‌ మాండమస్‌’  లేకపోతే అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో సుప్రీంకోర్టుకు సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ప్రకారం ప్రజా ప్రయోజనాలను సమర్థిస్తూ ఈ విషయంలో న్యాయం జరిగేలా చూసేందుకు కోర్టు జోక్యం చేసుకోవాలని పిటిషన్‌ కోరారు. 

 లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యి మూలం, నాణ్యతతో సహా ల్యాబ్‌ పరీక్షలపై దృష్టి సారించి సంబంధిత అధికారుల నుంచి వివరణాత్మక ఫోరెన్సిక్‌ నివేదిక పొందేందుకు మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ నేత కోరారు. లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, అవి భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

స‌మ‌గ్ర విచార‌ణ కోసం కమిటీ వేయాలని, నిజానిజాలు బయటకు రావాలనే ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చానని పేర్కొన్నారు. కాగా, గతంలో కూడా చంద్రబాబు నాయుడుపై తిరుపతి కోర్టులో తిరుపతి విషయమై డా. స్వామి కేసు వేశారు. ఆ సందర్భంగా రెండు పర్యాయాలు వైవి సుబ్బారెడ్డి సమకూర్చిన ప్రత్యేక విమానంలో వచ్చి తాడేపల్లిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.