పాక్‌ కాల్పులు జరిపితే ఓటర్లకు రక్షణగా బంకర్లు!

పాక్‌ కాల్పులు జరిపితే ఓటర్లకు రక్షణగా బంకర్లు!

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సరిహద్దుల్లో పాకిస్థాన్‌ కాల్పులకు పాల్పడే అవకాశాలు ఉన్నందున పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్‌ కాల్పులు జరిపితే ఓటర్లకు, ఎన్నికల సిబ్బంది రక్షణ కోసం స్థానిక యంత్రాంగం బంకర్లను నిర్మిస్తోంది. 

పాక్‌ కాల్పుల ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ బంకర్లను నిర్మించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌లో రెండో విడత జరగబోయే ఎన్నికల కోసం సైన్యం పకడ్బందిగా ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్‌ రోజు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగిన ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధమవుతుంది. 

ముఖ్యంగా నియంత్రణ రేఖ వెంబడి 100 కిలోమీటర్ల మేర పాక్‌తో సరిహద్దు పంచుకుంటున్న రాజౌరీ జిల్లాలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉగ్రవాదులు, దుండగులు జరిపే ఆకస్మిక దాడుల నుంచి ప్రజలను, పోలింగ్‌ సిబ్బందిని రక్షించడానికి ఆయా ప్రాంతాల్లో బంకర్లను నిర్మిస్తున్నారు. 

రాజౌరీ జిల్లాలో 2019కి ముందు కాల్పులు ఎక్కువగా జరిగేవని, ఆ ఏడాది తర్వాత నుంచి కొంచెం ప్రశాంతంగా ఉన్నట్లు పోలింగ్‌ అధికారులు తెలిపారు. గతంలో పాక్‌ కాల్పులు జరిపినా కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేసేందుకు వచ్చినట్లు వెల్లడించారు. తాజాగా తమ రక్షణ కోసం స్థానిక యంత్రాంగం బంకర్లను నిర్మించడంతోపాటు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడంపై వారు హర్షం వ్యక్తంచేశారు.

రాజౌరీ జిల్లాలో ఎన్నికలు సజావుగా జరగడానికి బంకర్ల నిర్మాణంతోపాటు ప్రత్యేక సిబ్బందిని సైతం నియమిస్తున్నారు. ఈ మేరకు స్పందించిన డిప్యూటి కమిషనర్‌ అభిషేక్‌ శర్మ అత్యవసర పరిస్థితుల్లోనూ రవాణా సాఫీగా సాగేందుకు, ఈవీఎంలను సులభంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

 ప్రాథమిక ఏర్పాట్లన్నీ సజావుగా సాగుతున్నాయన్నారు. ఆ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలిపారు. పరిస్థితులను పర్యవేక్షించడానికి 51 పోలింగ్‌ బూత్‌లకు ఒక ప్రత్యేక నోడల్‌ అధికారిని నియమించినట్లు వెల్లడించారు. సరిహద్దుల్లో ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ పదేళ్ల తర్వాత తాము ఓటు వేయనుండటంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జమ్ముకశ్మీర్‌లోని 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరిపేందుకు షెడ్యూల్‌ చేశారు. తొలి విడత పోలింగ్‌ 24 స్థానాల్లో సెప్టెంబర్‌ 18న ముగిసింది. ఈ నెల 25న జరగనున్న రెండో విడత పోలింగ్‌ కోసం స్థానిక యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్‌ 8న ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు.