అరుణాచ‌ల్ సరిహద్దు స‌మీపంలో చైనా కొత్త హెలిపోర్ట్ నిర్మాణం

అరుణాచ‌ల్ సరిహద్దు స‌మీపంలో చైనా కొత్త హెలిపోర్ట్ నిర్మాణం
అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ బోర్డ‌ర్ స‌మీపంలోని వాస్త‌వాధీన‌ రేఖ‌కు సుమారు 20 కిలోమీట‌ర్ల దూరంలో కొత్త హెలిపోర్టును చైనా నిర్మిస్తున్న‌ది. ఆ హెలిపోర్టును చాలా వేగంగా నిర్మిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇండో- చైనా బోర్డ‌ర్ వ‌ద్ద త‌మ కార్య‌క‌లాపాల‌ను వేగ‌వంతం చేసేందుకు ఈ పోర్టు ఉప‌యుక్తం కానున్న‌ది.  చైనా చాలా దూకుడుగా త‌న మిలిట‌రీని ఈ పోర్టు ద్వారా వాడుకునే అవ‌కాశం ఉన్న‌ది.
గోంగ్రిగాబు క్యూ న‌ది స‌మీపంలో హెలిపోర్టు నిర్మాణం సాగుతున్న‌ది. ఇది టిబెట్ స్వ‌యంప్ర‌తిప‌త్తి ప్రాంతంలోకి వ‌స్తున్న‌ది. అయితే చైనా ఆధీనంలో ఉన్న ప్రాంతంపై భార‌త్‌తో ఎటువంటి విభేదం లేదు.  మాక్స‌ర్ శాటిలైట్ చిత్రాల ద్వారా అక్క‌డ వేగంగా జ‌రుగుతున్న నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించ‌వ‌చ్చు. 2023 డిసెంబ‌ర్ ఒక‌టో తేదీ వ‌ర‌కు అక్క‌డ ఎటువంటి నిర్మాణం లేదు.
కానీ డిసెంబ‌ర్ 31వ తేదీన తీసిన చిత్రాల్లో మాత్రం ల్యాండ్ క్లియ‌ర్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఇక సెప్టెంబ‌ర్ 16వ తేదీన తీసిన మాక్స‌ర్ హెచ్‌డీ చిత్రాల ద్వారా.. ఆ ప్రాంతంలో ఆధునిక హెలిపోర్టు నిర్మాణం జ‌రుగుతున్న‌ట్లు తెలిసింది. కొత్త నిర్మాణం ద్వారా చైనా త‌న ర‌క్ష‌ణ‌, దూకుడు సామ‌ర్థ్యాన్ని పెంచుకుంటున్న‌ట్లు మిలిట‌రీ అధికారులు అంచ‌నా వేస్తున్నారు.
కొత్త హెలిపోర్టులో 600 మీట‌ర్ల ర‌న్‌వే ఉన్న‌ది. కొండ ప్రాంతాల్లో హెలికాప్ట‌ర్ల టేకాఫ్‌ల‌కు ఇది ఉప‌యోగ‌ప‌డుతున్నంది. హెలిపోర్టులో మూడు హ్యాంగ‌ర్లు ఉన్నాయి.  హెలికాప్ట‌ర్ల‌ను పొజిష‌న్‌లో పెట్టేందుకు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఫెసిలిటీ, వాటికి అనుబంధ‌మైన బిల్డింగ్‌లు, నిర్మాణాలు ఉన్నాయి. మ‌రోవైపు వాస్త‌వాధీన రేఖ వెంట చైనా జియోకాంగ్ గ్రామాల‌ను నిర్మిస్తున్న‌ది. వివాదాస్ప‌ద ప్రాంతాల్లో త‌మ ప‌ట్టును పెంచుకునేందుకు చైనా ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది.