తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని

తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని
తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్ గా ప్రారంభించారు. దుర్గ్-విశాఖపట్నం, నాగ్ పూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మోదీ ప్రారంభించారు. అయితే సికింద్రాబాద్-నాగ్ పూర్ వందే భారత్ రైలు ఈ నెల 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. 
 
ఇప్పటికే విశాఖ-సికింద్రాబాద్, భువనేశ్వర్-విశాఖ, సికింద్రాబాద్-విశాఖ మధ్య వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. తాజా రైళ్లతో ఈ సంఖ్య మరింత పెరిగింది. దుర్గ్-విశాఖ వందే భారత్…రాయ్ పూర్-విజయనగరం మార్గంలో మొదటిది.  దుర్గ్-విశాఖపట్నం(నెం.20829) వందే భారత్ రైలు దుర్గ్ నుంచి వారానికి 6 రోజులు(గురువారం తప్ప) నడపనున్నారు. 
 
ఈ రైలు ప్రతి రోజు ఉదయం 05.45 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు మధ్యాహ్నం 01.45 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలు(నెం.20830) విశాఖపట్నం నుంచి వారానికి 6 రోజులు (గురువారం మినహా) ప్రతి రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 10.50 గంటలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.

విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఈ రైలును ప్రధాని మోదీ వర్చుల్ ప్రారంభించగా  విశాఖలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్, డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొని రైలులో ప్రయాణించారు.

రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ వందే భారత్ రైలుతో భారతదేశ సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలిసిందని చెప్పారు. ఆత్మ నిర్భర భారత్, మేకిన్ ఇండియా కాన్సెప్ట్ నకు వందే భారత్ రైళ్లు ఒక ఉదాహరణ పేర్కొన్నారు. విశాఖ-దుర్గ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

కాగా, నాగ్‌పూర్‌ – సికింద్రాబాద్‌ మధ్య తొలి వందే భారత్‌ రైలును కూడా ప్రధాని ప్రారంభించారు. ఇక ఈ రైలు ఈ నెల 19 నుంచి అందుబాటులో ఉండనున్నది. ప్రతి మంగళవారం మినహా మిగతా ఆరు రోజులు పరుగులు తీస్తుంటుంది. ఈ సెమీ హైస్పీడ్‌ రైలు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నాగ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరుతుంది. 5.43 గంటలకు సేవ్‌గ్రామ్‌కు చేరుతుంది.
 
అక్కడి నుంచి 7.03 గంటలకు చంద్రాపూర్‌కు చేరుకొని.. 7.05 గంటలకు బయలుదేరుతుంది. 7.20 గంటలకు బల్హార్షా చేరుకొని.. 7.25 గంటలకు బయలుదేరి.. 9.08గంటలకు రామగుండం స్టేషన్‌కు వస్తుంది. 10.04గంటలకు కాజీపేట, మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుతుంది. ఇక తిరుగు ప్రయాణంలో ఒంటిగంటకు బయలుదేరి.. ఆయా స్టేషన్ల మీదుగా రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్‌కు చేరుకుంటుంది. ఇక ఈ రైలులో 20 కోచ్‌లు ఉంటాయి.