ప్రతిపక్షాలకు దేశం పట్ల ఎటువంటి బాధ్యత లేదు

ప్రతిపక్షాలకు దేశం పట్ల ఎటువంటి బాధ్యత లేదు
ప్రతిపక్షాలకు కేవలం సొంత రాజకీయ స్వార్థం తప్పితే దేశం పట్ల ఎటువంటి బాధ్యత లేదని, ఈ విషయం ఇటీవల విదేశాలలో పలు వేదికల నుంచి పార్టీల నేతలు చేస్తున్న ప్రసంగాల క్రమంలో కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు.  సోమవారం ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చారు. ఈ దశలో భుజ్ అహ్మదాబాద్ మధ్య నడిచే వందేభారత్ మెట్రో రైలుకు ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ పరోక్షంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికాలో చేసిన ప్రసంగాలను ఉద్దేశించి తీవ్రంగా విమర్శలు చేశారు.
 
మనసునిండా ద్వేషం నింపుకొన్న కొందరు భారత్‌, గుజరాత్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఇలాంటి వ్యక్తులు దేశాన్ని చీల్చే ఎజెండాతో భారత సమగ్రత, ఐక్యతను లక్ష్యంగా చేసుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వేష పూరిత వ్యక్తులు అవకాశం వచ్చినప్పుడల్లా భారత్ పరువు తీసేందుకు తెగిస్తున్నారని ప్రధాని విమర్శించారు.
 
 అసూయ ద్వేషం, ప్రతికూలత మేళవించుకున్న కొందరు తెరపైకి వచ్చారు. వీరు సందు దొరికినప్పుడు, వేదిక చిక్కినప్పుడల్లా దే శాన్ని దిగజార్చే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.  కుళ్లు కమ్ముకున్న మనసులు పలికే మాటలు చివరికి దేశ సమగ్రత సమైక్యతలకు భంగకరం అవుతాయని ప్రధాని హెచ్చరించారు. 
 
చివరికి వీరి విద్వేషం పరాకాష్టకు చేరుకుంటూ దేశాన్ని ముక్కలు చేసే ధోరణికి దారితీస్తోందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో కాంగ్రెస్‌ పొత్తుపెట్టుకున్న నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ 370 ఆర్టికల్‌ను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆ రాష్ట్రంపై రెండు రాజ్యాంగాలు, రెండు చట్టాలు రుద్దాలని అనుకుంటున్నారని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. తాను మూడో సారి అధికారం చేపట్టి వందరోజుల పాలన పూర్తయిన క్రమంలో ప్రతిపక్షం నుంచి తాను పలు అవమానాలు ఎదుర్కొన్నానని, గేలి చేశారని, అవహేళనలకు దిగారని మోదీ చెప్పారు. అయితే తాను ఇవేమీ పట్టించుకోకుండా ఈ సమయాన్ని కేవలం దేశ ప్రజల బాగుకు సంబంధించిన తమ వంద రోజుల అజెండాపైనే దృష్టి సారించానని ప్రధాని స్పష్టం చేశారు. 

ప్రతి భారతీయుడికి దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే తపన ఉంది. ఈ క్రమంలో జట్టు స్ఫూర్తి కనబడుతోంది. అయితే ఇందుకు భిన్నంగా తుక్డే తుక్డే గ్యాంగ్ తిరోగమనం దిశలో ఆలోచిస్తోందని దుయ్యబట్టారు. తాను జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేయాలని సంకల్పించుకున్నానని ప్రధాని స్పష్టం చేశారు. జీవిస్తే మీ కోసం జీవిస్తా, పోరాడితే మీ కోసం పోరాడుతా, బలిదానానికి దిగాలనుకుంటే మీ కోసం బలిదానం చేసుకుంటా అని అత్యంత ఉద్వేగభరిత ప్రసంగంలో మోదీ  తెలిపారు. దేశం కోసం తాను సర్వదా పాటుపడి తీరుతానని, ఈ క్రమంలో ఎటువంటి అడ్డంకులను అయినా ఎదుర్కొవడం జరుగుతుందని స్పష్టం చేశారు.