ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తైంది. భక్తుల కోలాహలం మధ్య మంగళవారం మధ్యాహ్నం ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద బడా గణేషుడిని నిమజ్జనం చేశారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన గణేషుడి శోభయాత్ర మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంది. మహా గణపతి శోభయాత్రలో వేలాది భక్తులు పాల్గొన్నారు.

ఖైరతాబాద్‌లో గణనాథుని నిమజ్జన ప్రక్రియ మధ్యాహ్నం గం.1.39 లకు పూర్తయింది. ఖైరతాబాద్ గణపతి శోభయాత్ర వైభవంగా సాగింది. 70 అడుగుల భారీ గణనాథుడిని వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య డప్పుల మోత, డీజేల సందడితో హుస్సేన్ సాగర్ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.  శోభాయాత్రను చూసేందుకు వేలాదిగా భక్తులు రోడ్లపైకి రావడంతో హుస్సేన్ సాగర్ రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. భారీగా ప్రజలు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఖైరతాబాద్‌ గణపయ్య శోభాయాత్ర మంగళవారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైంది. గణేషుడు టెలిఫోన్‌ భవన్‌, సెక్రటేరియట్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా ట్యాంక్‌ బండ్‌ చేరుకున్నాడు. అక్కడ వెల్డింగ్‌ పనులు పూర్తి చేసిన తర్వాత మహాగణపతికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్ద ఉన్న భారీ క్రేన్ వద్ద నిమజ్జనం చేశారు.

 గణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు హుస్సేన్ సాగర్ వద్దకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ట్యాంక్‌బండ్‌ జనసంద్రంగా మారిపోయింది. గతపతి బప్పా మోరియా నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మోతమోగుతున్నాయి. ఖైరతాబాద్ మహా గణపతి ఉత్సవాలను ప్రారంభించి 70 ఏండ్లు పూర్తయిన సందర్భంగా… ఈఏడాది 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

శిల్పి చిన్న స్వామి రాజేందర్‌ ఆధ్వర్యంలో ఏడు తలలతో విగ్రహాన్ని రూపొందించారు. 200 మంది కార్మికులు ఒకటిన్నర రోజులు శ్రమించి గణేషుడ్ని అలంకరించారు. 11 రోజుల పాటు ఖైరతాబాద్ గణేషుడిని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ ఏడాది మహాగణపతికి రూ.1.10 కోట్ల ఆదాయం వచ్చింది. హుండీ ఆదాయం రూ.70 లక్షలు కాగా, ప్రకటనలు, హోర్డింగుల ద్వారా మరో రూ.40 లక్షలు సమకూరాయని నిర్వాహకులు తెలిపారు.

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.  సెక్రటేరియెట్ వద్ద ఖైరతాబాద్ మహాగణపతికి సీఎం రేవంత్ స్వాగతం పలికారు. తెలుగుతల్లి ప్లైఓవర్ కింద నుంచి ఎన్టీఆర్ మార్గ్ లని క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిమజ్జన వేడుకలో ముఖ్యమంత్రి పాల్గొనడం ఇదే మొదటిసారి.