అంతరిక్షం నుంచే ఓటు వేయనున్న సునీతా విలియమ్స్‌, విల్‌మోర్‌

అంతరిక్షం నుంచే ఓటు వేయనున్న సునీతా విలియమ్స్‌, విల్‌మోర్‌

బోయింగ్‌ సంస్థ ఈ ఏడాది జూన్‌లో చేపట్టిన స్టార్‌లైనర్‌ స్పేస్‌ మిషన్‌ ద్వారా వ్యోమగాములు సునీతా విలియమ్స్ , బుచ్‌ విల్‌మోర్‌ ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే తిరుగు ప్రయాణంలో బోయింగ్‌ స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపం తలెత్తటంతో వ్యోమగాములు అంతరక్షింలోనే ఉండిపోవాల్సి వచ్చింది. 

వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ, వారిద్దరూ అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో వారు స్పేస్‌ నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. సునీతా విలియమ్స్‌, విల్‌మోర్‌ తాజాగా స్పేస్‌ నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 

ఈ సందర్భంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ప్రస్తావించారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఐఎస్‌ఎస్‌ నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అమెరికా పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం తమ కర్తవ్యమని చెప్పారు. బ్యాలెట్‌ కోసం తమ అభ్యర్థనను నాసాకు పంపామని, ఇందుకు నాసా సహకరిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘పౌరులుగా మాకు అది అత్యంత ముఖ్యమైన బాధ్యత. రోదసి నుంచే వోటు వేయగలగడానికి ఎదురుచూస్తున్నా. ఇక్కడ ఎంతో చల్లగా ఉంది’ అని భారత సంతతికి చెందిన సునీత విలేకరులతో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు. 58 ఏళ్ల సునీత, 61 ఏళ్ల విల్మోర్ జూన్ నుంచి తమకు నివాసంగా ఉన్న ఐఎస్‌ఎస్ నుంచి విలేకరుల గోష్ఠిలో పాల్గొన్నారు. 

నాసా ఉద్యోగులు రోదసి నుంచి వోటు వేయడానికి వీలు కల్పిస్తూ టెక్సాస్ శాసనసభ ఒక బిల్లును 1997లో ఆమోదించినప్పటి నుంచి అమెరికన్ వ్యోమగాములు రోదసి నుంచే వోటు వేస్తున్నారని ‘న్యూయార్క్ పోస్ట్’ తెలియజేసింది. ఆ సంవత్సరం నాసా వ్యోమగామి డేవిడ్ వుల్ఫ్ మిర్ స్పేస్ స్టేషన్‌లో రోదసి నుంచి వోటు వేసిన తొలి అమెరికన్‌గా ఘనత సాధించారు. కాగా, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మరి ఏడుగురు వ్యోమగాములతో కలసి ఐఎస్‌ఎస్‌లో నివసిస్తున్నారు.

ఇదిలా ఉండగా సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్‌మోర్‌లను ఐఎస్‌ఎస్‌ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) వద్దే వదిలేసి బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక భూమిపైకి చేరుకుంది. వ్యోమగాములు లేని ఖాళీ స్పేస్‌క్రాఫ్ట్‌ వారం రోజుల క్రితం న్యూమెక్సికోలో దిగింది. ఇక సెప్టెంబర్‌లో ‘నాసా’ స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ‘డ్రాగన్‌’ రాకెట్‌ను పంపేందుకు సిద్ధమవుతున్నది. ఫిబ్రవరిలో చేపట్టే తిరుగు ప్రయాణంలో సునీతా విలియమ్స్‌, విల్‌మోర్‌ భూమి మీదకు చేరుకుంటారని తెలిసింది.