నిరసన శిబిరంలో వైద్యులతో మమతా బెనర్జీ

నిరసన శిబిరంలో వైద్యులతో మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనకు వ్యతిరేకంగా నెల రోజులుగా నిరసన చేస్తున్న జూనియర్‌ డాక్టర్లను సీఎం మమతా బెనర్జీ ఆశ్చర్యపరిచారు. శనివారం మధ్యాహ్నం అనూహ్యంగా వారు నిరసన చేస్తున్న వేదిక వద్దకు ఆమె వెళ్లారు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని జూనియర్‌ డాక్టర్లను కోరారు. వ్యతిరేక నినాదాల మధ్య బెంగాలీలో మమత మట్లాడారు.
 
‘దయచేసి ఐదు నిమిషాలు నా మాట వినండి. ఆపై నినాదాలు చేయండి. అలా చేయడం మీ ప్రజాస్వామ్య హక్కు. నేను చాలా కాలం ఎదురు చూస్తున్నా. నా భద్రతా అధికారుల సలహాకు వ్యతిరేకంగా, మీ నిరసనకు సెల్యూట్ చేయడానికి నేను ఇక్కడకు వచ్చా. నా పోస్ట్‌ పెద్ద విషయం కాదని నాకు తెలుసు. మీ వాయిస్ ముఖ్యం’ అని ఆమె చెప్పుకొచ్చారు.
 
కాగా, జూనియర్‌ డాక్టర్లు భారీ వర్షంలో రోడ్డుపై నిరసనలు చేస్తుంటంతో తాను కూడా నిద్రలేని రాత్రులు గడిపానని మమతా బెనర్జీ తెలిపారు. వారి డిమాండ్లను పరిశీలిస్తానని, దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రిగా కాకుండా ‘దీదీ’గా డాక్టర్లను కలిసేందుకు వచ్చినట్లు చెప్పారు.
 
‘మీ నిరసన ఉద్దేశం నాకు అర్థమైంది. నేను కూడా విద్యార్థి నాయకురాలిని. జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. మీకు న్యాయం చేస్తా. మీ సహాయం లేకుండా సీనియర్‌ వైద్యులు పని చేయలేరు. విధుల్లో చేరాలని మిమ్మల్ని కోరుతున్నా. మీపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని నేను హామీ ఇస్తున్నా’ అని ఆమె తెలిపారు.
 
“మీ డిమాండ్లను కచ్చితంగా అధ్యయనం చేస్తాం. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం. ఆర్జీ కర్‌ ఆసుపత్రిలో రోగుల సంరక్షణ కమిటీని రద్దు చేస్తున్నా. దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని సిబిఐని కోరుతున్నా. నామీద విశ్వాసం ఉంటే చర్చలకు రండి. మీరు వెంటనే విధుల్లో చేరండి. మీపై ఎలాంటి చర్యలు తీసుకోబోం” అని మమతా బెనర్జీ కోరారు. 
 
అయితే, తమ డిమాండ్లపై చర్చ జరిగేవరకు రాజీకొచ్చే ప్రసక్తే లేదని వైద్యులు తేల్చిచెప్పడం వల్ల సీఎం అక్కడినుంచి వెళ్లిపోయారు. తమ ఐదు డిమాండ్లపై లైవ్‌లో చర్చలు జరిగే వరకు రాజీపడే ప్రసక్తే లేదని ఆందోళన చేస్తున్న జూనియర్‌ డాక్టర్లు మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
మరోవంక, డాక్టర్‌పై హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనకు దిగిన వైద్యులపై దాడికి కుట్ర పన్నినట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ మేరకు కుట్రకు సంబంధించి ఓ ఆడియో టేప్‌ను ఆ పార్టీ నేత కునాల్‌ ఘోష్‌ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. వైద్యులపై దాడి చేసి ఆ నిందను మమత ప్రభుత్వంపై నెట్టేలా కమ్యూనిస్టు నేతలు కుట్ర పన్నినట్లు కునాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. 
 
ఆ ఆడియోలో వామపక్ష యువజన విభాగానికి చెందిన సభ్యుడు ఆవతలి వ్యక్తితో వైద్యులపై దాడి చేయడం గురించి మాట్లాడుతున్నారని కునాల్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్వాస్థ్య భవనం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు సీపీఎం నేతసహా మరో వ్యక్తిని అరెస్టు చేశారు.