కాదంబరీ జత్వానీ కేసులో ఏసీపీ, సీఐ సస్పెండ్‌

కాదంబరీ జత్వానీ కేసులో ఏసీపీ, సీఐ సస్పెండ్‌

ముంబయి నటి కాదంబరీ జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ఆమెను వేధించిన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. విజయవాడలో పని చేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం.సత్యనారాయణలను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.  ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్‌లు పి.సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్‌ గున్నీలపై సహితం చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో  ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశముంది.

మరోవైపు ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు నమోదు చేసి, అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్‌గున్ని, వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌లపై కేసు నమోదు చేయాలని కాదంబరీ జత్వానీ ఫిర్యాదు చేశారు. వీరంతా కుమ్మక్కై చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. 

శుక్రవారం రాత్రి తన న్యాయవాదులు పీవీజీ ఉమేష్‌ చంద్ర, పాల్‌లతో కలసి ఆమె విజయవాడ కమిషనరేట్‌ పరిధిలోని ఇబ్రహీంపట్నం స్టేషన్‌కు వెళ్లారు. సీఐ చంద్రశేఖర్‌కు ఈ మేరకు ఆమె ఫిర్యాదును అందజేశారు. ఆమె వెంట తండ్రి నరేంద్ర కుమార్‌ జత్వానీ, తల్లి ఆశా జత్వానీ ఉన్నారు.

విద్యాసాగర్‌తో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి, హుటాహుటిన అక్రమంగా కేసు నమోదు చేసి, తనతో పాటు తల్లిదండ్రులను ముంబయిలో అరెస్టు చేశారని అందులో పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన వెంటనే ఆగమేఘాలపై ముంబయి వచ్చి ముగ్గుర్ని అరెస్టు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. 

కస్టడీకి తీసుకున్న ఐదు రోజులూ తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, అర్ధరాత్రి కూడా ఇంటరాగేషన్‌ చేశారని వివరించారు. ఏ తప్పూ చేయకపోయినా తమ కుటుంబం 42 రోజుల పాటు విజయవాడ కారాగారంలో ఉండాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారకులైన ఐపీఎస్‌ అధికారులు, విద్యాసాగర్‌పై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో నటి కాదంబరి కోరారు.

దీనిపై ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్‌ స్పందిస్తూ, ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుని, కేసు నమోదు చేస్తామని ఆమెకు చెప్పారు. నిబంధనల ప్రకారం తాము ఎస్‌హెచ్‌వోకు ఫిర్యాదు చేశామని, తమకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై నమ్మకం ఉందని న్యాయవాది ఉమేష్‌చంద్ర పేర్కొన్నారు.  కాదంబరి వ్యవహారంలో మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఒక ఎస్‌ఐ పాత్ర ఉన్నట్టు అధికారులు నిర్ధారించినట్టు సమాచారం. త్వరలో వారి పైనా చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.