నేను పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు వ్యతిరేకం కాదు

నేను పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు వ్యతిరేకం కాదు
భారత్‌లో గత కొంతకాలంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు, సీఎన్‌జీ వాహనాలపై వాహనదారులు మక్కువ చూపుతున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సైతం ఈవీ, సీఎన్‌జీ ఆటోమోటివ్‌ పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై వైఖరిని స్పష్టం చేశారు. 
 
తాను పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 64వ ఏసీఎంఏ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ గ్రీన్‌ ఎనర్జీ మార్చేందుకు తప్పనిసరి చేయనప్పటికీ.. మార్కెట్‌ శక్తులు మార్పును నడిపిస్తాయని పేర్కొన్నారు.  బజాజ్ ఫ్రీడమ్ 125 ఉదహరిస్తూ.. బైక్‌ సీఎన్‌జీతో నడుస్తుందని.. పెట్రోల్‌తో నడిచే మోడల్స్‌తో పోలిస్తే 40శాతం పొదుపు చేయవచ్చని తెలిపారు. 
 
ఎలక్ట్రిక్‌ వాహనాలు 60శాతం వరకు ఎక్కువ ఖర్చు కూడుకున్నవని,  ఈ ఖర్చు ప్రయోజనాలు చివరికి వాహన తయారీదారులు తమ స్వచ్ఛమైన ఇంధన వాహనాలను అందించేలా చేస్తాయని పెక్రోన్నారు. భారతదేశ వాయు కాలుష్యంలో 40 శాతం రవాణారంగం ద్వారానే ఉత్పత్తమవుతోందని, అయితే, ఆ శాఖకు తాను మంత్రిగా బాధ్యత వహిస్తున్నానని తెలిపారు. అది మంచిదేనా? అంటూ ప్రశ్నించారు. 
 
నైతికత, ఆర్థిక వ్యవస్థ, జీవావరణ శాస్త్రం, పర్యావరణం సమాజానికి పునాది అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.  మన జీవావరణాన్ని కాపాడేందుకు.. గాలి, నీటి కాలుష్యం నుంచి రక్షించాలని సూచించారు. క్లీన్‌ ఎనర్జీ వాహనాలు వినియోగదారుకలు, పర్యావరణానికి మేలు చేయడంతో పాటు దేశ విస్తృత ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతాయని వివరించారు.
 
ఇతర దేశాలు క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ కోసం వెతుకుతున్నాయని, తద్వారా లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా ఎగుమతులను పెంచుకోవడానికి కూడా సాంకేతికత, ఆవిష్కరణలు, బయో-ఇంధనాలు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అనుసరించడం ముఖ్యమని వివరించారు.