పారాలింపిక్స్‌లో 18వ స్థానంలో భారత్

పారాలింపిక్స్‌లో 18వ స్థానంలో భారత్

పారాలింపిక్స్‌లో భార‌త క్రీడాకారులు కొత్త చ‌రిత్ర లిఖించారు. అస‌మాన పోరాటంతో పారా విశ్వ క్రీడ‌ల‌ రికార్డులు తిర‌గ‌రాశారు. ఈ క్రీడా పండుగ చ‌రిత్ర‌లోనే దేశానికి అత్య‌ధిక ప‌త‌కాలు అందించారు. 25 పతకాలు సాధించడమే లక్ష్యంగా ఈ పోటీల్లో బరిలోకి దిగిన భారత్.అంచనాలను అధిగమించింది. దాంతో, భార‌త్ ఖాతాలో మునుపెన్న‌డూ లేని విధంగా 29 ప‌త‌కాలు వ‌చ్చి చేరాయి. 

పారిస్‌లో మ‌న క్రీడాకారులు పారా విశ్వ క్రీడ‌ల్లో 7 స్వ‌ర్ణాలు, 9 ర‌జ‌తాలు, 13 కాంస్య ప‌త‌కాలు కొల్ల‌గొట్టారు. దాంతో, ఈసారి ఇండియా ప‌త‌కాల ప‌ట్టిక‌లో 18వ స్థానంలో నిలిచింది.  అవనీ లేఖరా భారత్ తరఫున పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి మహిళా షూటర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. జావెలిన్ త్రోలో తన స్వర్ణాన్ని నిలబెట్టుకున్న సుమిత్ యాంటిల్  పారాలింపిక్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత పురుష అథ్లెట్‌గా నిలిచాడు.

జావెలిన్ త్రోలో న‌వ్‌దీప్ సింగ్ స్వ‌ర్ణంతో గ‌ర్జించాడు. దాంతో, భార‌త్ ప‌తకాల సంఖ్య 29కి చేరింది. ఈసారి అథ్లెట్లు ఏకంగా 17 మెడ‌ల్స్ సాధించ‌డం విశేషం. పారాలింపిక్స్ ముగింపు వేడుక‌లు ఆదివారం సాయంత్రం అట్ట‌హాసంగా జరిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్చర్ హ‌ర్వీంద‌ర్ సింగ్, అథ్లెట్ ప్రీతి పాల్‌లు ప‌త‌క‌ధారులుగా వ్య‌వ‌హ‌రించారు. హ‌ర్వీంద‌ర్ ఆర్చ‌రీలో తొలి స్వ‌ర్ణం గెలుపొంద‌గా.. ప్రీతి అథ్లెటిక్స్‌లో రెండు కాంస్యాల‌తో ప్ర‌భంజ‌నం సృష్టించింది.

పారాలింపిక్స్‌లో షూట‌ర్‌ అవ‌నీ లేఖ‌రా స్వ‌ర్ణంతో ప‌త‌కాల ఖాతా తెరిచింది. అవ‌నితో పాటు 10 మీట‌ర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైన‌ల్ చేరిన‌ మోనా అగ‌ర్వాల్ కంచు మోత మోగించింది. అక్క‌డితో మొద‌లు భార‌త క్రీడాకారుల ప‌త‌కాల వేట కొన‌సాగించారు. అథ్లెటిక్స్‌లో ప్రీతి పాల్చిరుత‌ను త‌ల‌పిస్తూ 100 మీట‌ర్లు, 200 మీట‌ర్ల పోటీల్లో కాంస్యంతో చ‌రిత్ర సృష్టించింది. 

ఇక షూట‌ర్ మ‌నీష్ న‌ర్వాల్ ర‌జ‌తం కొల్ల‌గొట్టాడు.. ఆర్చ‌రీ, జావెల‌న్ త్రో, హైజంప్, షాట్‌పుట్, డిస్క‌స్ త్రో, క్ల‌బ్ త్రో, జూడో, బ్యాడ్మింట‌న్‌లో భార‌త క్రీడాకారులు ప‌త‌కాల‌తో యావత్ భార‌తావ‌నిని సంబురాల్లో ముంచెత్తారు.   ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 తేదీల మధ్య జరిగిన పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. మొత్తం 12 విభాగాల్లో మనవాళ్లు పోటీ పడ్డారు. 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌తో పోలిస్తే మూడు విభాగాల్లో అదనంగా మన వాళ్లు పోటీ పడ్డారు.

ఈసారి పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. స్విట్జర్లాండ్, బెల్జియం, సౌత్ కొరియా, టర్కీ, అర్జెంటీనా లాంటి దేశాల కంటే మిన్నగా భారత్ 2024 పారాలింపిక్స్‌లో పతకాలు గెలుపొందింది. పారిస్‌లో అంచనాలకు మించి రాణించిన భారత్.. 2028లో లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగే పారాలింపిక్స్‌లో టాప్-10 నిలవాలని లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉంది.