విజయవాడలో బుడమేరు పరివాహక ప్రాంతాలకు హై అలర్ట్ జారీ చేశారు. కృష్ణా ఇరిగేషన్ సర్కిల్ అధికారులు ఆదివారం అర్థరాత్రి అత్యవసర హెచ్చరికలను జారీ చేశారు. దీంతో సోమవారం తెల్ల వారుజాము నుంచి పోలీసులు, రెవిన్యూ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ 8వ తేదీ ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో బుడమేరుకు వరద నీరు వచ్చి చేరుతోంది. పరీవాహక ప్రాంతంలో నిరంతరంగా మరియు భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షపాతం అంచనా వేసినందున, బుడమేరు నదికి ఎప్పుడైనా భారీ, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
బుడమేరులో వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. దీంతో వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నీటిమట్టం 2.7 అడుగులకు చేరుకుంది. ఎలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, సింగ్‌నగర్, గుణదల, రామవరప్పాడు ప్రాంతాలకు మళ్లీ వరద ముప్పు పొంచి ఉంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలను రక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు.
బుడమేరు డైవర్షన్ ఛానల్‌కు గండ్లు పడటం, వరద ముంపు ముంచెత్తడం వంటి ఘటనల నేపథ్యంలో మరోసారి వరద వస్తుందని అంచనా వేస్తున్నారు. బుడమేరు ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయాల్సి ఉండటంతో ముందే అలర్ట్ జారీ చేశారు. బుడమేరు ప్రవాహం ఏడు అడుగుల ఎత్తుకు చేరుతుందని అంచనా వస్తున్నారు.
వరద దిగువకు విడుదల చేస్తే బుడమేరు పక్కనే ఉన్న ఈలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, సింగ్ నగర్, గుణదల, ఎన్టీఆర్ జిల్లా రామవరప్పాడు తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు.
వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను తక్షణమే తరలించి, అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని, సంబంధిత అధికారులు మరియు ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. తాజా హెచ్చరికల నేపథ్యంలో ఉదయం నుంచి పోలీసులు, రెవిన్యూ యంత్రాంగం అయా ప్రాంతాల్లో వరద హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
More Stories
తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆరోపణలపై కుమారస్వామి ఆగ్రహం
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసి నిధులివ్వాలి