ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో బుల్డోజర్లతో అక్రమార్కుల గుండెల్లో వణుకు  హైడ్రా లాంటి చట్టం ఆంధ్ర ప్రదేశ్ లోనూ తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.  బుడమేరు వాగు పొంగడానికి ఆక్రమణలే ప్రధాన కారణమని చెబుతూ ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొచ్చి బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని చెప్పుకొచ్చారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
రాష్ట్రంలో భారీవర్షాలు, వరదల కారణంగా 45మంది మరణించారు. ఒక్క ఎన్టీఆర్‌ జిల్లాలోనే మృతుల సంఖ్య 35కు చేరింది. గల్లంతైన ఒకరి ఆచూకీ ఇంకా లభించలేదు. వరదల కారణంగా రూ.6,882 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్‌ అనంతరం నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి శనివారం ప్రాథమిక నివేదికను పంపింది.
కాగా, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో ప్రజలు ఇబ్బంది పడకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విజయవాడ వరదను గమనంలో ఉంచుకుని ముందస్తు చర్యలను వేగంగా తీసుకోవాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజల ఫోన్లకు అలర్ట్‌ మెసేజ్‌లు పంపాలని కోరారు. ఆదివారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు
 
మరోవైపు.. అల్లూరి జిల్లాకు ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే అవకాశాలున్నాయన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినట్టు చంద్రబాబు తెలిపారు. విశాఖలో కొండచరియలు విరిగిపడిన విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. కొల్లేరు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాబు సూచించారు.
 
విజయవాడలో ఎనిమిదో రోజు కూడా బాధితులు నీటిలోనే ఉన్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరద ప్రాంతాల్లో ఇప్పటికీ 0.51 టీఎంసీ నీళ్లు ఉన్నాయని, రోడ్లపై ఇసుక, మట్టి లేకుండా శుభ్రం చేస్తున్నాని తెలిపారు. వరద వల్ల పాడైపోయిన ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు బాగు చేయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గృహోపకరణాలకు మరమ్మతులు చేయించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం కలిశారు. విజయవాడలోని రాజ్‌ భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్‌తో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. విజయవాడ నగరాన్ని కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తడంతో ఆయన గవర్నర్‌ను కలసి ఈ పరిణామాలను వివరించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వరదల వల్ల జరిగిన నష్టం, బాధితులను ఆదుకోవడానికి తాము తీసుకొన్న చర్యలను చెప్పారు.