జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద చొరబాట్లు, దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అడ్డుకునేందుకు భారత సైన్యం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, కాశ్మీర్ పోలీసులతో కలిసి ముమ్మరంగా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు చేస్తూనే ఉంది. అయినప్పటికీ ఇటీవలి కాలంలో వరుసగా జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు జరుగుతుండటం తీవ్ర సంచలనంగా మారింది.
2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ ఉగ్రదాడులు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత సైన్యం రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది. ఉగ్రవాదులను తరిమికొట్టేందుకు గ్రామస్థులకే శిక్షణ ఇస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల వరుసగా ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో స్థానికంగా భద్రతను పెంచేందుకు కొత్త కార్యక్రమం తీసుకువచ్చింది.
విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌కు శిక్షణ ఇచ్చేందుకు భారత సైన్యం, జమ్మూ పోలీసులు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం వల్ల జమ్మూ పౌరులు.. వారి గ్రామాలను రక్షించుకోవడంతోపాటు.. సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు చర్యలు చేపట్టింది. గ్రామస్థులకు ఆయుధాలు వినియోగించడంలో నైపుణ్యం కల్పించడంతో పాటు ఉగ్రవాదుల నుంచి రక్షణ కల్పించడమే లక్ష్యంగా భారత సైన్యం ఈ నిర్ణయం తీసుకుంది.
దాదాపు 600 మంది శిక్షకులు ఆటోమేటిక్ రైఫిల్స్, స్క్వాడ్ పోస్ట్ డ్రిల్స్ వంటివాటిపై లోతయిన శిక్షణ ఇస్తున్నారు. వీలైనంత త్వరగా విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌కు శిక్షణ ఇచ్చి వారి సేవలను ఉపయోగించుకునేలా ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రతి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ యూనిట్ కనీసం 3 రోజులపాటు శిక్షణ పొందునున్నారు.
సరోల్‌లోని కార్ప్స్ బ్యాటిల్ స్కూల్ నుంచి శిక్షకులతోపాటు ఆయుధాలను సమకూర్చారు. ఇండియన్ ఆర్మీ ఫార్మేషన్స్ గ్రామస్థులకు శిక్షణ ఇవ్వడంలో నాయకత్వం వహిస్తోంది. జమ్మూ కాశ్మీర్ పోలీసుల అభ్యర్థన మేరకు ఇండియన్ ఆర్మీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటికే రాజౌరిలో 500 మందిక, దోడా, కిష్త్వార్ ప్రాంతాల్లో 90 మందికి శిక్షణను ప్రారంభించారు.
ఇక ఆర్మీ ఆర్డినెన్స్ డిపోలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తర్వాత విలేజ్ డిఫెన్స్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్‌తో విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌లు కూడా డ్యూటీ చేయనున్నారు. వారి కమ్యూనిటీలను రక్షించుకోవడానికి వారికి మరింత సాధికారతను భారత సైన్యం కల్పిస్తోంది.
More Stories
బయటపడిన మావోయిస్టుల భారీ ఆయుధాల డంప్
99.1 కోట్లకు చేరిన భారత ఓటర్ల సంఖ్య
మహారాష్ట్రలో పుష్పక్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 12 మంది మృతి