
ప్రముఖ సమాచార సంస్థ వికీపీడియాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వార్తా సంస్థ ఏఎన్ఐ వికీపీడియాపై పరువు నష్టం కేసు వేసిన విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత న్యాయవ్యవస్థ ఆదేశాలను పాటించకపోతే, భారతదేశంలో తమ వ్యాపారాన్ని మూసివేయమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని స్పష్టం చేసింది.
మీకు భారతదేశం నచ్చకపోతే ఇక్కడ మీ కార్యాకలాపాలు మూసివేయాలని కోర్టు హితవు చెప్పింది. వికీపీడియా తన పేజీలో ఏఎన్ఐ ని ప్రస్తుత ప్రభుత్వానికి ‘ప్రచార సాధనం’గా పేర్కొన్న సమాచారాన్ని రాసిందని వార్తా సంస్థ తెలిపింది. ఈ క్రమంలో వార్తా సంస్థ ఏఎన్ఐ వికీపీడియాపై ఢిల్లీ కోర్టులో రూ.2 కోట్ల పరువు నష్టం దావా వేసింది.
వికీపీడియా తన ప్లాట్‌ఫారమ్‌లో సవరణలు చేసుకోవడానికి వ్యక్తులను అనుమతిస్తోందని ఏఎన్ఐ ఆరోపించింది. ఏఎన్ఐ పేజీలో వార్తా సంస్థకు బదులుగా ప్రభుత్వ ప్రచార సాధనంగా ఉందని వికీపీడియా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు గురువారం వికీపీడియాకు ధిక్కార నోటీసు జారీ చేసింది.
ఈ క్రమంలో న్యాయస్థానం ఆ సంస్థను హెచ్చరించింది. వికీపీడియా తన ప్లాట్‌ఫారమ్‌లోని వార్తా సంస్థ పేజీలలో అవమానకరమైన విషయాలను ప్రచురిస్తోందని ఏఎన్ఐ ఆరోపించింది. ఈ విషయాన్ని ఆపివేయాలని, తొలగించాలని కోర్టును డిమాండ్ చేసింది. డిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నవీన్ చావ్లా ఈ కేసులో వికీపీడియా న్యాయవాది వాదన పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సంస్థ భారతదేశం కేంద్రంగా లేకపోవంతో కోర్టుకు హాజరు కావడానికి తమకు సమయం పడుతుందని చేసిన వాదన పట్ల న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌఖిక వ్యాఖ్యలు చేస్తూ ఇకపై ఈ అంశాన్ని సహించేది లేదని కోర్టు తెలిపింది. అవసరమైతే దేశంలోనే మీ కార్యకలాపాలు మూసివేయాలని ప్రభుత్వాన్ని కోరతామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ సమయంలో కోర్టుకు హాజరు కావాలని వికీపీడియా అధీకృత ప్రతినిధిని కోర్టు కోరింది.
ఈ క్రమంలో కేసు తదుపరి విచారణను అక్టోబర్ 25, 2024కు కోర్టు వాయిదా వేసింది. అంతకుముందు సమన్లు జారీ చేసిన తర్వాత వికీపీడియా ప్రతినిధి ఆగస్టు 20, 2024న కోర్టుకు హాజరయ్యారు. వికీపీడియాలో సవరణలు చేసిన ముగ్గురు వ్యక్తులు తమ ప్రతినిధులు కాదని చెప్పడంతో వారి వివరాలను రెండు వారాలలో ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
More Stories
మాఘ పూర్ణిమ వేళ కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
ఇవిఎంల నుండి డేటాను తొలగించొద్దు.. రీలోడ్ చేయొద్దు
భారత్ పాక్ సరిహద్దుల్లో బాంబు పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి