తెలంగాణ ఉద్యమ కెరటం జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి

తెలంగాణ ఉద్యమ కెరటం జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి
తెలంగాణ ఉద్యమ కెరటం, భువనగిరి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించి, విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని స్వరాష్ట్ర సాధన కోసం తనదైన శైలిలో పోరాటం సాగించిన జిట్టా బాలకృష్ణారెడ్డి నింగికెగిశారు. గత కొన్ని రోజులుగా ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్‌తో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తది శ్వాస విడిచారు.

తెలంగాణ ఉద్యమకారుడిగా జిట్టా బాలకృష్ణారెడ్డికి మంచి పేరు ఉంది. కేసీఆర్‌తో అత్యంత సన్నిహితంగా ఉండి ఉద్యమంలో కీలకంగా పని చేశారు. అయితే 2009లో పొత్తులో భాగంగా భువనగిరి టికెట్‌ను టీడీపీకి కేటాయించారు. దీంతో ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జిట్టా రెండో స్థానంలో నిలిచారు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జిట్టా వైఎస్సార్ మరణంతో ఆ పార్టీకి సైతం రాజీనామా చేశారు.

2014లో భువనగిరి అసెంబ్లీకి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. వైఎస్ఆర్‌సీపీలో కొంతకాలం పనిచేసిన జిట్టా  యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. 2018లో బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా భువనగిరి నుంచి పోటీ చేసినప్పటికీ గెలుపు అందుకోలేకపోయారు.  2022లో బీజేపీలో చేరి పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 

అక్కడి నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో 2023 అక్టోబర్ 20న బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గడచిన అసెంబ్లీ ఎన్నికలలో సైతం ఆయన భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.

జిట్టా బాలకృష్ణ రెడ్డి 14 డిసెంబర్ 1972న  యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1987లో బీబీ నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి సెకండరీ స్కూల్, 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, 1993లో ఎల్‌బీ నగర్ నుంచి డీవీఎం డిగ్రీ అండ్ పీజీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు.

జిట్టా బాలకృష్ణారెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన పోరాటంలో జిట్టా బాలకృష్ణ రెడ్డి క్రియాశీలకంగా పాల్గొన్నారని వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. వారి మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

జిట్టా మరణంపై రేవంత్ తన ట్విట్టర్‌లో భావోద్వేగానికి గురయ్యారు. మిత్రుడు, సన్నిహితుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. యువతను ఐక్యం చేసి చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక ప్రాత పోషించారని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రేవంత్ ట్వీట్ చేశారు.

బాలకృష్ణారెడ్డి మృతి పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుకైన పాత్ర వహించారని కొనియాడారు. చిన్నతనం నుండి జాతీయవాద రాజకీయాలకు, బిజెపితో సన్నిహితంగా ఉంటూ సమాజం  కోసం ఎంతో తపనపడే వారని గుర్తు చేసుకున్నారు. బిజేపిలోనూ చేరి నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన అనేక ఉద్యమాలు, పోరాటాల్లో భాగమయ్యారని తెలిపారు.